బిజినేపల్లి ః నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన పాపకంటి రమేష్(24) అనే యువరైతు పిడుగు పడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య ఖానాపూర్ గ్రామంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని యాసంగిలో వరి ధాన్యం సాగు చేశారు. ఆదివారం వరి చేను కోత కోసమని నాగయ్య అతని కొడుకు రమేష్‌తో పాటు అల్లుడు కృష్ణలు కలిసి పొలం వద్దకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురవడంతో నాగయ్య, రమేష్, కృష్ణతో పాటు మరో వ్యక్తి ట్రాక్టర్ కింద తల దాచుకోవడానికి వెళ్లారు.
అదే సమయంలో రమేష్‌కు ఫోన్ రావడంతో ఎత్తి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మతి చెందగా అక్కడే ఉన్న నాగయ్య, కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానిక రైతులు తక్షణమే వారిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దుర్ఘటనలో నాగయ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించడం జరిగిందని, కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వీరితో పాటు మరో ఇద్దరు పిడుగు పాటుకు గురి కాగా వారికి ఎలాంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు.