Wednesday, March 26, 2025

ఎంఎంటిఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

రైలు బోగీలో ఒంటరిగా ఉన్న
యువతిపై అఘాయిత్యం
చేయబోయిన దుండగుడు
తప్పించుకునేందుకు
రైల్లోంచి దూకిన యువతి,
తీవ్రగాయాలు దుండగుడి
గుర్తింపు త్వరలో
పట్టుకుంటామని పోలీసుల
ప్రకటన

మన తెలంగాణ/సికింద్రాబాద్: సికింద్రాబాద్ రై ల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.ఎంఎంఎటిఎస్ రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ ఆగంతకుడు అత్యాచార యత్నాని కి పాల్పడ్డాడు. అనంతరపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్ సమీపంలో వసతి గృహంలో ఉంటూ అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన సెల్‌ఫోన్‌ను రిపేరు చేయించుకోవడానికి సికింద్రాబాద్‌కు వచ్చింది. తన పని పూ ర్తి చేసుకున్న అనంతరం శనివారం రాత్రి 7.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటిఎస్ రైలులో మేడ్చల్‌కు తిరుగు ప్రయాణమైంది. మహిళ బోగిలో ఎక్కిన ఆ యువతితోపాటు మరో ఇద్దరు యువతులు ఉన్నారు. వారు మార్గమధ్యలో అల్వాల్ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. దీంతో మహిళా బోగిలో యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆగంతకుడు ఆమెపై బలత్కారం చేయడానికి యత్నించారు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో యువతి నడుస్తున్న రైలులోంచి బయటకు దూకేసింది. దీంతో ఆ యువతికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి ముఖం, తలపైన గాయాలై అచేతనంగా పడిపోయింది. స్థానికులు 108 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

సిసి ఫుటేజి ఆధారంగా ఇప్పటికే నిందితున్ని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు రైల్వే ఎస్‌పి చందనదీప్తి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా త్వరలోనే నిందుతున్ని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఎస్‌పి చందన దీప్తి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తర్వాత రోజున బాధితురాలు ఫిర్యాదు చేసిందని ఈ క్రమంలో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచమ్మ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. రాత్రి 7.20 గంటల సమయంలో సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ రైలులో మహిళబోగిలో ప్రయాణిస్తుండగా 8.30 గంటల సమయంలో మేడ్చెల్‌కు దగ్గరలో బోగిలో ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ ఆగంతకుడు ఆమె చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన రూంకు రావాలని బలవంతం చేశాడు. అతన్ని తప్పించుకునే క్రమంలో గుండ్లపోచమ్మ రైల్వేస్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలు నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ కిందకు దూకేసిందన్నారు. 108 ద్వారా సమాచారం మేరకు యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, గాయాల పాలైన యువతి ఆరోగ్యం నిలకలడగా ఉందని ఆమె తెలిపారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాగా మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

మహిళలకు భద్రత కరువు : బిఆర్‌ఎస్
కాగా ఎంఎంటిఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నాన్ని పలువురు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. సోమవారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు పరామర్శించారు. బాధితురాలికి మద్దతుగా బిఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. జిఆర్‌పి ఎస్‌పి చందనదీప్తి యువతిని పరామర్శించారు. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. బాధితురాలికి అండగా ఉంటామన్నారు. లైంగిక దాడికి యత్నించిన దుండగున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని , ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సి కవిత ఫోన్‌లో చందనదీప్తితో మాట్లాడి యువతి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. యువతిపై జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News