Monday, January 20, 2025

అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అనుమానాస్పద స్థితిలో హోటల్ రూమ్‌లో ఉరి వేసుకొని నర్సింగ్ అప్రెంటిస్ చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం…. జడ్చర్లకు చెందిన గొల్ల శృతి (23) నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని అప్రెంటిస్ చేస్తుంది. ఆమెకు మహబూబ్ నగర్‌కు చెందిన డ్రైవింగ్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జీవన్ పౌల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. షాద్‌నగర్‌కు చెందిన మౌనిక, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన వెంకటేష్ జీవన్ స్నేహితులు. జీవన్ ద్వారా శృతికి వెంకటేష్, మౌనికతో స్నేహం ఏర్పడింది. కాగా నలుగురు వినాయక నిమజ్జనం చూడడానికి నగరానికి వచ్చి గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్ రెడ్ స్టోన్ హోటల్‌లో దిగారు. ఆదివారం సరదాగా గడిపిన వారు సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం వేడుకలు చూడడానికి వెళ్లాలనుకున్నారు. కాని శృతి తనకు తలనొప్పిగా ఉందని హోటల్ గదిలోనే ఉండిపోయింది.

దాంతో జీవన్, వెంకటేష్, మౌనికలు నిమజ్జనం చూడడానికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చి చూడగా గది లోపలి నుండి గడియపెట్టి ఉంది. గది తలుపులు ఎంతకొట్టినా గదిలో నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో వెంటనే హోటల్ సిబ్బందికి తెలిపారు. సిబ్బంది వారి వద్ద ఉన్న రూమ్ మాస్టర్ కీద్వారా లాక్ తీసి చూడగా శృతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా హస్పిటల్‌కు తరలించారు. శృతి ఆత్మహత్య పట్ల తండ్రి వెంకటయ్య అనుమానం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబసభ్యుల అనుమానం
శృతి అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే హోటల్ గదిలో రక్తపు మరకులు ఎందుకు ఉంటాయని, కనీసం మేము వచ్చే వరకు కూడా మృతదేహన్ని ఉంచకుండా పోస్టుమార్టంకు పంపించడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News