సిటిబ్యూరోః నగరంలోని నల్లకుంటకు చెందిన యువతి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసేది. ఈమధ్య పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేఆఫ్ ప్రకటిస్తుండడంతో యువతి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న యువతి మరో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో నౌకరీ. కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. ఇది చూసిన సైబర్ నేరస్థులు బాధితురాలిని సంప్రదించారు. తాము ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని ప్రముఖ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. కానీ దానికి కొన్ని డబ్బులు ఖర్చుల కింద చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మంచి ఉద్యోగం అంటున్నారు కదా అని భావించిన యువతి వారు చెప్పినట్లు వివిధ ఫీజుల కింద రూ.1.70లక్షలు పంపించింది. మీకు కంపెనీ నుంచి కాల్ వస్తుందని ఫోన్‌లోనే ఇంటర్వూ నిర్వహిస్తారని చెప్పింది. వీరి మాటలు నమ్మిన బాధితురాలు కంపెనీ ఫోన్ కోసం ఎదురుచూస్తోంది. డబ్బులు కట్టి చాలా రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ఫోన్ రాలేదు.
దీంతో తనను సంప్రదించిన వారి ఫోన్ నంబర్‌కు కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోస పోయానని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా చాలామంది బాధితులు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో రెజ్యూమ్‌ను పెట్టి మోసపోతున్నారు. అసలే ఉద్యోగం పోయిందని బాధలో ఉన్న వారికి సైబర్ నేరస్థులు ఉద్యోగం పేరుతో డబ్బులు దోచుకోవడంతో లబోదిబోమంటున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు లక్షలాది రూపాయలను దోచుకుంటున్నారు. డబ్బులు వారికి అందగానే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పారిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వ్యక్తులు ఉంటున్నారు. వీరు మల్టీ నేషన్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. వీటిని చూసిన ఉద్యోగం పోయిన నిరుద్యోగులు వెంటనే వారిని సంప్రదిస్తున్నారు. ఇలాంటి కేసులు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇటీవలి కాలంలో ఎక్కువగా అవుతున్నాయి.
ఇలా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా సభ్యులు నోయిడాలో అపార్ట్‌మెంట్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని దందా చేస్తున్నారు. అక్కడి వారికి అనుమానం రాకుండా ఉండేందుకు బ్యాంకుల రికవరీ చేస్తున్నామని వారికి చెబుతున్నారు. కానీ నిందితులు వివిధ జాబ్ వెబ్ సైట్ల నుంచి నిరుద్యోగుల డాటా తీసుకుని వారికి ఫోన్లు చేస్తున్నారు. అందులో కూడా అందరికి ఫోన్లు చేయకుండా ఆసక్తి కనబర్చిన వారికి మాత్రమే మళ్లీ ఫోన్లు చేసి హెచ్‌సిఎల్, హిందూస్తాన్ లివర్, టిసిఎల్, ఐసిఐసిఐ తదితర కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని నమ్మిన వారి నుంచి వివరాలు తీసుకుని ఉద్యోగానికి కావాల్సిన ప్రాసెస్ చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల్లో చేస్తున్న మాదిరిగా ఉండడంతో నిరుద్యోగులు నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్, దుండిగల్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అమాయకులు లక్షలాది రూపాయలు ఇచ్చి మోస పోయారు. గతంలో కూడా చాలామంది నిరుద్యోగులు దేశానికి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని సైబర్ నేరస్థులు చెప్పడంతో నమ్మి మోసపోయారు. బ్యాక్‌డోర్ ఎంట్రి పేరుతో నేరస్థులు పలువురిని నమ్మించి లక్షలాది రూపాయలు దోచుకున్నారు. గతంలో ఎస్‌ఆర్ నగరలో ఓ సంస్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో చాలామంది నిరుద్యోగులు ఒక్కొక్కరు చొప్పున రూ.1.50లక్షలు కట్టారు. డబ్బులు కట్టి నెలలు దాటుతున్నా కూడా ఉద్యోగాల కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒత్తిడిని తట్టుకోలేని సదరు సంస్థ రాత్రికి రాత్రి కార్యాలయాన్ని మూసివేసి బిచాణ ఎత్తివేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్‌లైన్ వచ్చే ప్రకటనలను నమ్మ వద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిరుద్యోగులు మారడంలేదు. ఉద్యోగం వస్తుందనే ఆశతో వెనుకా ముందు చూడకుండా వారిని నమ్మి నిండా మునుగుతున్నారు.
లే ఆఫ్‌తో….
పలు మల్టీనేషనల్ కంపెనీలో ఆర్థిక మాంద్యం వస్తోందని, ఖర్చులు తగ్గించుకోవాలనే తలంపుతో విచ్చలవిడిగా ఉద్యోగులను తీసివేస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డుపై పడుతున్నారు. ఖర్చులు ఉండడంతో వెంటనే ఉద్యోగం వెతుకోవాల్సిన పరిస్థితి,దీంతో ఆన్‌లైన్‌లో వివిధ జాబ్ వెబ్‌సైట్లలో తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. దీనిని చూస్తున్న సైబర్ నేరస్థులు వారి వివరాలు తీసుకుని, ఫోన్లు చేస్తున్నారు. మీ ప్రొఫైల్ చూశామని, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. దీంతో బాధితులు వారు చెప్పినట్లు చేసి లక్షలాది రూపాయలు ఇచ్చి మోస పోతున్నారు.