కొల్చారం: ఆస్తి విషయంలో అమ్మను చిత్రహింసలకు పాల్పడుతున్న అన్నదమ్ములకు గొడవ కావడంతో అన్న పై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి లక్ష్మీ, శంకరయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ప్రవీణ్, ప్రశాంత్, అశోక్‌లు ఉన్నారు. తండ్రి శంకరయ్య గత 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. ప్రశాంత్‌ను చిన్నతనంలోనే గ్రామంలోని చింతల రాములు ఇంటికి ఇల్లరికం పంపారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులు గా నియమిస్తున్న దాంట్లో ప్రశాంత్ భార్యకు సైతం ఉద్యోగవకాశం లభించింది. అయినప్పటికీ ప్రశాంత్ తన అన్న ఆస్తి పై కన్నేశాడు. ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తన అన్న ప్రవీణ్, తమ్ముడు అశోక్‌లతో నిత్యం గొడవ పడేవాడు. ప్రశాంత్ అమ్మను సైతం తీవ్రంగా కొట్టేవాడే గ్రామస్తులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం తనకు ఆస్తిలో వాటా కావాలని ప్రశాంత్ తరచూ గొడవలు చేసేవాడు. దీంతో శంకరయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు ఆస్తిలో వాటా పంచుకోవాలని తెలిపింది. వాటా ఇవ్వకపోతే అన్న ప్రవీణ్‌ను చంపుతానని గతంలోనే చెప్పడంతో తల్లి మాటలు విన్న ప్రశాంత్ అందరూ నిద్రిస్తున్న క్రమంలో పెట్రోల్ తీసుకువచ్చి ప్రవీణ్ పై పోసి తగలబెట్టాడు. దీంతో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు ప్రవీణ్ ను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా పూర్తిస్థాయి ఆధారాలను సేకరించారు. అంతకు ముందే నిందితుడు కొల్చారం పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.