ఆయన బోధనల స్ఫూర్తితోనే గవర్నర్‌గా ఎదిగా
ఆత్మనిర్భర్ భారత్‌లో యువతే కీలకం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి, ఆయన బోధనల స్ఫూర్తితోనే తాను గవర్నర్‌గా ఎదిగానని, ఆత్మనిర్భర్ భారత్‌లో యువతే కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువోత్సవ్ 2021ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సంస్థ 21వ జాతీయ స్టూడెంట్ కంపెనీ సెక్రటరీస్ సదస్సును మంగళవారం నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తాను పాఠశాలలో చదువుతున్నప్పుడు తనకు స్వామి వివేకానంద పుస్తకాన్ని బహూకరించారని, అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు స్వామిజీ బోధనలు చదువుతున్నానని, అవి తనలో నిరంతరం స్ఫూర్తి నింపుతాయని ఆమె తెలిపారు. కొందరు యువకులు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యకు పాల్పడడం తనను కలచివేస్తుందన్నారు.
వారు వివేకానంద స్ఫూర్తిదాయక రచనలు చదివి ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వారు కాదని ఆమె స్పష్టం చేశారు. సినిమా హీరోలకు పాలాభిషేకం యువత చేయడం చూస్తుంటాం, కానీ సమస్తమైన శక్తి తమలోనే ఉందని, యువత తెలుసుకోవాలి, ప్రతి యువత వారికి వారే నిజమైన హీరోలుగా భావించి గొప్ప పనులు చేయాలన్నారు. ప్రపంచంలో యువజనులకు ఎక్కువగా కలిగి ఉన్నది భారతదేశమని, ఇది భారత్ సమగ్ర అభివృద్ధికి అత్యంత అనుకూల అంశమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, మౌలానా అజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్శిటీ ఇన్‌చార్జీ విసి రహమతుల్లా, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.