Monday, December 23, 2024

కొవిన్ డేటా లీక్ వ్యవహారం.. బీహార్ వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్ లోని సమాచారం లీకైన వ్యవహారంలో బీహార్‌కు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అదుపు లోకి తీసుకుంది. ప్రముఖులు, ఉన్నతాధికారులకు సంబంధించిన సమాచారాన్ని ఈ వ్యక్తే సోషల్ మీడియాలో లీక్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆరోగ్యకార్యకర్తగా ఉన్న అతడి తల్లి నుంచి ఈ వివరాలు సంపాదించినట్టు తెలియడంతో ఆమెను కూడా పోలీస్‌లు విచారిస్తున్నారు.

కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ అనే ప్రత్యేక పోర్టల్‌ను కేంద్రం వినియోగిస్తోంది. ఫోన్ నెంబరు, ఆధార్ నంబర్ వివరాలు నమోదు చేసి పౌరులు టీకా తీసుకుంటున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తోపాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ సమాచారం కూడా ఉంటుంది. ఇలాంటి కీలక సమాచారం మెసెంజర్ యాప్ టెలిగ్రామ్‌లో బయటపడడం సంచలనం కలిగించింది.

అయితే ఓటీపీతో మాత్రమే పోర్టల్ లోని డేటాను చూడగలమని , దాని నుంచి డేటా లీకయ్యే అవకాశమే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీనిపై ఢిల్లీ పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ)తో కలిసి ఈ బాట్‌తోపాటు దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే బీహార్‌కు చెందిన యువకుడిని ఢిల్లీ పోలీస్‌లు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News