జైపూర్ : రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో రెండు కుటుంబాల మధ్య నలుగుతున్న భూవివాదం ఒకరినొకరు కర్రలు, రాళ్లతో దాడులకు , చివరికి ఒకరి పై ట్రాక్టర్ ఎనిమిది సార్లు నడిపించి ప్రాణాలు తీసిన కిరాతక సంఘటనకు దారి తీసింది. ఈ దారుణ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరత్‌పూర్‌లో బహదూర్ సింగ్, అతర్‌సింగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం సాగుతోంది. బుధవారం ఉదయం బహదూర్‌సింగ్ కుటుంబం ట్రాక్టర్‌పై వివాదాస్పద పొలం వద్దకు చేరుకుంది. కొంత సేపు తరువాత అతర్‌సింగ్ కుటుంబం కూడా అక్కడకు వచ్చింది. దీంతో భూవివాదంపై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలు, రాళ్లతో దాడులు జరిగాయి.
ఈ ఘర్షణలో అతర్‌సింగ్ కుమారుల్లో ఒకరైన నిర్పత్ నేలపై పడిపోవడంతో సోదరుడి వరుసైన దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్‌పై దూసుగా నడిపించాడు. ముందుకు వెనక్కి 8 సార్లు ట్రాక్టర్‌ను పోనిచ్చి తొక్కి చంపాడు. మిగతా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నా వినిపించుకోలేదు. ఈ సంఘటన తెలిసి పోలీస్‌లు వెంటనే ఆ పొలం వద్దకు వెళ్లి నిందితుడు దామోదర్‌ను అరెస్ట్ చేశారు. మరో నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. గాయపడిన పది మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్‌తో సోదరుడ్ని తొక్కి చంపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌అయి స్థానికంగా కలకలం రేపి రాజకీయ విమర్శలకు దారి తీసింది. దీనిపై బీజేపీ అధికార పార్టీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ప్రియాంక గాంధీకి ధైర్యం ఉంటే భరత్‌పూర్ వెళ్లి సందర్శించాలని బీజేపీ నేత సంబిత్‌పాత్రా విమర్శించారు.