Wednesday, January 22, 2025

నిరాశ నిస్పృహల్లో యువత

- Advertisement -
- Advertisement -

ఉపాధి అవకాశాలు లేకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. ప్రజలు ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములు కాకపోవడం, కుటుంబ ఆదాయంతో పాటు జాతీయ ఆదాయానికి లోటు ఏర్పడే పరిస్థితి, అర్హతలు, నైపుణ్యాలకు అనువైన పనులు లేకపోవడం నిరుద్యోగం క్రిందికి వస్తుంది. ఆర్థిక పరిభాషలో ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా పనులు లేకుండా ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిణమించినటువంటి స్థితిని నిరుద్యోగం అంటే మరింత సందర్భోచితంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు అనేవి ప్రభుత్వం, ప్రైవేటురంగ సంస్థలు, స్వయం ఉపాధి పథకాల ద్వారా పనులు కల్పించుకోవడం అనే మూడు కోణాలలో ప్రధానంగా మనకు కనపడుతున్నవి. శ్రామికశక్తి ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తిలో వెనుకబాటుతనం ఆవరిస్తే దాన్ని కూడా నిరుద్యోగముగానే పరిగణించవచ్చు. మానవ వనరులను సందర్భోచితంగా దేశాభివృద్ధిలో కీలక భూమిక వహించే విధంగా ఉపయోగించుకోవడం అనేది ప్రభుత్వాల సామాజిక బాధ్యత, నిబద్ధత, నైపుణ్యం, ఆర్థిక మేధస్సుపై ఆధారపడి ఉంటుంది.

కరోనా ఉధృతంగా దేశవ్యాప్తంగా ఆవరించిన 2020 2021 సంవత్సరాలలో ఉపాధి కోసం, బతుకుతెరువు కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ దేశ వ్యాప్తంగా పనులలో లీనమైనటువంటి వలస కార్మికులు వున్న కొద్ది అవకాశాలను కూడా కోల్పోయి కనీసం తమ సొంత స్థలాలకు వెళ్లడానికి డబ్బులు, వాహనాలు, ఇతర సౌకర్యాలు లేక పాదయాత్రల ద్వారా అనారోగ్యం బారిన పడి ప్రమాదాలకుగురై కొంతమంది దారిలోనే చనిపోయిన వారిని కూడా మనం గమనించి వున్నాం. అప్పటి వరకు కానీ భారత ప్రభుత్వానికి వలస కార్మికుల స్థితిగతులు అర్థం కాలేదు అని అనేక మంది మేధావులు, ఆర్థికవేత్తలు, పాలనా నిపుణులు చేసిన విమర్శలు ఇప్పటికీ చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో నిరుద్యోగ స్థితిగతులు, ఆర్థికవేత్తల అభిప్రాయాలు, నిరుద్యోగానికి కారణాలు, శ్రామిక శక్తి, సామర్థ్యాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ఆలోచించడం, నిరుద్యోగ యువత కార్మిక శక్తిలో ఉపాధి కల్పనకై, హక్కుల సాధనకై ఉద్యమ జ్వాలను ప్రజ్వరింపజేయడం అనేవి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రచయితలపైన ఆ బాధ్యత ఎంతో ఉందని గుర్తించడం మంచిది.

ఒక దేశంలో శ్రామిక శక్తి రేటును బట్టి ఆ దేశంలో ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ స్థాయిని అంచనా వేయడానికి అవకాశం ఉం టుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకానమీ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారంగా భారత దేశంలో ప్రస్తుత శ్రామిక శక్తి 2022 నవంబర్ నాటికి 43.7 కోట్లకు చేరుకున్నది. 2019లో శ్రామిక శక్తి 44.2 కోట్లు ఉండగా, కరోనా విస్తృతంగా ఆవరించిన తర్వాత 2020లో ఆ సంఖ్య 42.4 కోట్లకు తగ్గింది. అంటే ఉపాధి అవకాశాలు తగ్గిన కారణంగా వలస జీవులతో పాటు అనేక మందికూడా ఉపాధి అవకాశాలను కోల్పోవడమే ఇందుకు కారణం. తిరిగి కరోనా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత 2021లో 43.5 కోట్లకు పెరగగా, గత సంవత్సర కాలంగా కరోనా ఉండి లేనట్టుగా నామమాత్రం గానే ఉన్నప్పటికీ పెద్దగా శ్రామికశక్తి పెరగకపోవడం ఈ దేశంలో నిరుద్యోగం ఏ రకంగా ప్రబలుతున్నదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నది.

ఇక 2019లో కరోనా వ్యాప్తికి ముందు 4.5 కోట్లుగా వున్న నిరుద్యోగుల సంఖ్య 2020లో 5.3 కోట్లకు, 2021లో 4.8 కోట్లకు, చివరికి 2022 నవంబర్లో 5.1 కోట్లకు చేరుకున్నప్పటికీ 2020 గణాంకాలకు కూడా అందుబాటులో లేకపోవడం అనేది మన నిరుద్యోగ ఉధృతిని తెలియజేస్తున్నది. ఈ గణాంకాల ఆధారంగా పరిశీలించినప్పుడు దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 11% నిరుద్యోగులు ఉన్నారనే విషయం తేటతెల్లమవుతున్నది. అదే సమయంలో 2022 డిసెంబర్‌లో నిరుద్యోగ శాతం 8.7 వుంటే అందు లో పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా 9.9 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాలలో 8.1%గా వున్నట్లు పైసంస్థ తన తాజా నివేదికలో వెల్లడించడాన్ని భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ విజ్ఞులు పలు కోణాలలో ఆలోచిస్తూ భారత రాజకీయ వ్యవస్థ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ ద్వారానే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలు బలపడతాయి. కనుక పాలక పక్షాలు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణలు, ఏకపక్ష విధానాలు, కార్పొరేట్ సంస్థలకు చేయూత కూడా ఈ వైఫల్యాలకు కారణమై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశ వ్యాప్తంగా వున్న పైగణాంకాలు కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే నిరుద్యోగం ప్రబలిపోయిందని అనుకుంటే పొరపాటే. వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వ విధానాల వైఫల్యాలు, బాధ్యతారాహిత్యం, స్పష్టతలేని యువజన విధానాలు, యువతను నిర్వీర్యపరుస్తున్నటువంటి అనేక సామాజిక రుగ్మతలు, మాధ్యమాలు, మద్యం, క్లబ్బులు, పబ్బులు, టివి, సెల్ ఫోన్, సినీ సంస్కృతి కూడా యువతను నిర్వీర్య పరిచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంచే ప్రమాదంఉన్నది. మొత్తం మీద పాలక పక్షాల సామాజిక కోణం సరిగా ఉన్నప్పుడు మాత్రమే శ్రామిక శక్తిని పెంచుకోవడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, యువతను పూర్తిగా వినియోగించుకోవడం, మానవ వనరులను పరిపాలనలో భాగస్వాములను చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు గుర్తిస్తే మంచిది. లేకుంటే ఈ ఫలితాలు లేదా పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ వ్యాసకర్త, సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు అభిప్రాయం ప్రకారంగా ప్రస్తుత దుస్థితికి ఈ కిందివి కారణాలని తెలియచేస్తున్నారు. 1) ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ హామీ నిలబెట్టుకోకపోవడం 2. కేంద్ర ప్రభుత్వం అనుకరిస్తున్న కార్పొరేట్ విధానం వలన ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యమై ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం 3. జాతి సంపదను ప్రజలందరికీ పంచే బదులు ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా పెట్టుబడిదారుల జేబులు నింపడం వల్ల కూడా నిరుద్యోగం పెరిగిపోతున్నది 4. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వున్న పరిశ్రమలు, కర్మాగారాలు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోక 70% మాత్రమే ఉత్పత్తిలో వినియోగిస్తున్నందున ఉపాధి అవకాశాలు తగ్గి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్న విషయాన్ని కూడా గమనించాలి.

ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విధానాలతో
నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు
1). ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తూ ప్రైవేటీకరణను నిరోధించే విధంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను పాలకులు అనుకరిస్తే మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉత్పత్తిలో భాగస్వాములై దేశ ఆర్థిక పరిపుష్టి కూడా దోహదం జరుగుతుంది 2). వ్యవసాయ రంగంలో మరిన్ని అవకాశాలను కల్పించడం ద్వారా, రైతులకు పెట్టుబడి అవకాశాలను సరళతరం చేయడం ద్వారా, రైతు శ్రమను గుర్తించడం ద్వారా, గిట్టుబాటు ధరను కల్పించడం ద్వారా, మెరుగైన ఆదాయ మార్గాలను ఇవ్వడం ద్వారా కూడా నిరుద్యోగాన్ని కొంత వరకు నిర్మూలించవచ్చు. అంటే వ్యవసాయాన్ని లాభసాటి పరిశ్రమగా మార్చడం అనేది పూర్తిగా రాజకీయపరమైన ప్రక్రియ. వ్యవసాయ రంగం సుమారుగా ఆర్థిక వ్యవస్థలో అర్ధభాగాన్ని మోస్తున్న సందర్భంలో ఆ రంగానికి వెన్నుదన్నుగా ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు లోకాన్ని ఆగం చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే 4) విద్య, వైద్య రంగాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించడం ద్వారా కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

ఏదో రకంగా ఉత్పత్తిలో భాగస్వాములు కావడానికి వీలుపడుతుంది 5). ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ అజమాయిషిని కొనసాగించడం ద్వారా కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు. ప్రస్తుత గణాంకాల ప్రకారం గా 5.1 కోట్లుగా వున్న నిరుద్యోగుల ఆదాయ మార్గాలను మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రుణ సౌకర్యాలను కల్పించడం ద్వారా కూడా స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించి మెరుగుపరిచి ఉత్పత్తిలో ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసుకోవడానికి అవకాశం ఉన్నది. స్వయం ఉపాధి పథకాలు కూడా ఉపాధి, ఉద్యోగంలో భాగమే కదా!పని సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలు, విద్య, సాంస్కృతిక రంగాలు విస్తృతంగా కొనసాగినప్పుడు యువత, మిగతా వర్గాలు తమ బాధ్యతలను గుర్తించి ఉత్పత్తిలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వపరంగా కొనసాగుతున్నటువంటి నిర్వీర్యపరిచే చర్యలను మానుకోకపోతే, యువతలో అసంతృప్తిని పెంచి పరీక్షించినట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల వారసులు పోరాటాలకు సిద్ధపడతారు. ఉద్యమాలను లేవదీస్తారు. తమ హక్కులను సాధించుకుంటారు అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది.

వడ్డేపల్లి మల్లేశము-9014206412

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News