Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్శితులై.. యువత బిఆర్‌ఎస్ పార్టీలో చేరిక

- Advertisement -
- Advertisement -

పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావడానికే బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు
200 యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేముల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్శితులై యువత బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం, భీంగల్, బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గొన్గొప్పల గ్రామాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వేముల సమక్షంలో మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కెసిఆర్, కెటిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన యువతకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరడానికి వచ్చిన వారంతా ఏదో ప్రచార ఆర్భాటం కోసం రాలేదని, పార్టీ నిర్మాణం కోసమే వచ్చారని, ఇలాంటి మార్పు యువతలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అబద్దం ఎక్కువ రోజులు నిలబడదని, నీళ్లను చూపెట్టి పాలు అని నమ్మించలేమని బిజెపి తీరును మంత్రి ఎండగట్టారు.

దేశ ఆస్తుల చట్టాలను అదానీ తుంగలో తొక్కి…
యువత ఆలోచనలు భవిష్యత్ భారతానికి మంచిదన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలు చేస్తున్న బిజెపికి దానికి స్వస్తి పలకాలని, లేకుంటే బిజెపి వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు వాటిల్లనుందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. దేశ సంపదంతా బిజెపి మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి దేశ ఆస్తుల చట్టాలను తుంగలో తొక్కి మరీ అప్పనంగా మోడీ కట్టబెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించి ప్రజల సొమ్మును మోడీ ప్రభుత్వం ఆవిరి చేసిందని వేముల మండిపడ్డారు. ఎయిర్ పోర్టులు ఒక ప్రైవేటు సంస్థకు 2 చొప్పున మాత్రమే ఇవ్వాలని ఆర్డర్స్ ఉంటే అదానీ కంపెనీకి మోడీ ప్రభుత్వం 6 ఎయిర్ పోర్టులను కట్టబెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఓడరేవులు, రైల్వేస్టేషన్లు, అన్ని ప్రభుత్వ సంస్థలను దారాదత్తం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 2జీ వేలంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపించిన మోడీ 5జీ విషయంలో రూ.15 లక్షల కోట్ల మేర అవినీతి జరిగితే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడీ దోస్త్‌ల కంపెనీలకు 5జీ స్పెక్ట్రం అప్పనంగా కట్టబెట్టారని వేముల ఆరోపించారు.

బిజెపిపైఈడీ కేసులు పెట్టాలి
దేశంలో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా, ఇక్కడి బొగ్గు టన్నుకు రూ.3నుంచి రూ.5వేలకు వస్తుందని, ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గని నుంచి సుమారు 3లక్షల కోట్ల బొగ్గు భారత దేశానికి దిగుమతి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. దానిని రూ.30వేలకు టన్ను కొనాలని కేంద్రం విద్యుత్ డిస్కంలకు ఆర్డర్ వేసిందని మంత్రి దుయ్యబట్టారు. దీనిని ప్రశ్నించినందుకు వారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఈడీ కేసు అంటేనే నేడు ఓ పెద్ద జోక్ అయిపోయిందన్నారు. సిబిఐ, ఈడీ, ఐటి లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని వేముల మండిపడ్డారు. ఈడీ కేసులు పెడుతున్నారని, కానీ, ఒక్క కేసులో కూడా నేరం రుజువు చేయలేకపోతున్నారని వేముల ఆరోపించారు. అసలు దేశం మొత్తాన్ని అన్ని రంగాల్లో దోచుకుంటున్న బిజెపిపై ఈడీ కేసులు పెట్టాలని, ఈడీ, సిబిఐ విచారణ జరిపి మోడీ, అమిత్ షాలు తమ సచ్చీలతను నిరూపించుకోవాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రధానికి లేదా
కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారని, ప్రధాని మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని మంత్రి ఆరోపించారు. అన్ని రకాల ధరలు పెంచి సామాన్యుల జీవనం భారం చేశారన్నారు. బిజెపి నీచ రాజకీయాలు, దేశ సంపదను దోచుకుంటున్న తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు అకాల వర్షాలు పడి రైతుల నష్టపోవాలని, నష్టపోయిన రైతుల వద్దకు పోయి మొసలి కన్నీరు కార్చాలని కోరుకుంటున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రధాని మోడీకి లేదా అని మంత్రి వేముల నిలదీశారు. కేంద్ర బిజెపి తమ బాధ్యతను విస్మరించినా రాష్ట్రంలో కెసిఆర్ రైతులకు భరోసా కల్పించారన్నారు.

కెసిఆర్‌తోనే సమగ్రాభివృద్ధి
రాష్ట్రంలో, దేశంలో కెసిఆర్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మంత్రి వేముల స్పష్టం చేశారు. నేడు తెలంగాణ అభివృద్ది మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. అభివృద్ది చెందిన గ్రామాలు ఎక్కడ అంటే తెలంగాణ వైపు చూస్తున్నారని, కేంద్రమే అవార్డులు ఇస్తుందని ఆయన గుర్తు చేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌వన్ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి, రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News