ఆజాది కా అమృతోత్సవ్ (75వ స్వాతంత్య్ర దినోత్సవాలు) జరుపుకొంటున్న సమయంలో భారత దేశ బలం బలహీనతలను గురించి చర్చించుకోడం సమంజసంగా ఉంటుంది. మన బలహీనతలను తొలగించుకోడానికి మనకున్న బలాలను ఎంత చక్కగా వినియోగించుకోగలుగుతున్నాము, ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధనలో ఎంతవరకు విజయం సాధించాం అనేది కీలకమైన అంశం. ఇందులో ప్రధానమైనది మనకున్న మానవ వనరుల వినియోగం. ముఖ్యంగా యువశక్తిని దేశాభివృద్ధి కోసం ఎంత బాగా వినియోగించుకోగలుగుతున్నామనేది ముఖ్యమైన ప్రశ్న. 2023 నాటికి భారత జనసంఖ్య చైనాను మించిపోతుందని, ఆ తర్వాత ఇంకా పైపైకి పోతుందని 2022 ఐక్య రాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించి 2050 నాటికి దాని జన సంఖ్య 130 కోట్లకు పరిమితం కావచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఇందులో 50 కోట్ల మంది అరవై ఏళ్ళు, అంతకు పైబడినవారు ఉంటారని అభిప్రాయపడింది. అదే సమయానికి భారత దేశ జనాభా 170 కోట్లు దాటుతుందని చెప్పిన నివేదిక అందులో 60 ఏళ్ళు, అంతకు పైబడినవారు 33 కోట్ల మంది మాత్రమే ఉంటారని చెప్పింది. అంటే పని చేసే వయసు జనాభా చైనాలో కంటే ఇండియాలోనే అత్యధికంగా ఉంటుందని తెలియజేసింది. ఇది నిస్సందేహంగా మన అసాధారణ బలం. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత దేశ శ్రామిక శక్తి ఇప్పుడున్న దాదాపు 90 కోట్ల నుంచి 108 కోట్లకు చేరుతుందన్నది మరో అంచనా. చైనాలో మాదిరిగా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒకే సంతానం వంటి తీవ్ర నిర్బంధ విధానాలను మనం అమల్లోకి తేలేదు. అలాగే మానవ శక్తిని సద్వినియోగం చేసుకోడం లోనూ దానితో మనం పోటీ పడలేకపోయాము. దేశంలోని నిరుద్యోగ యువతరంలో విద్యావంతులై ఉద్యోగాలు లేనివారి గురించే తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. ఎందుకంటే నిరక్షరాస్యులు, చదువు ఆరంభం లోనే ఆపేసేవారు శారీరక శ్రమ చేసి పొట్ట పోషించుకోడానికి వెనుకాడరు. విద్యావంతులైన నిరుద్యోగులు మాత్రం తమ చదువుకు తగిన ఉన్నతోద్యోగం లభించే వరకు క్రియాశూన్యంగా వేచి వుంటారు. గత జనవరిలో మధ్యప్రదేశ్‌లో పది వేల మంది ఉన్నత విద్యావంతులు డ్రైవర్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీర్లు, లాయర్లు, ఎంబిఎ చదువుకున్నవారు వున్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు 2020, 2021లలో 7 శాతంగా కొనసాగింది. ఇది 2021 డిసెంబర్‌లో 8 శాతానికి చేరుకొన్నది. ఇది మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఉధృత స్థాయి నిరుద్యోగ రేటు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మన పొరుగునున్న బంగ్లాదేశ్ సహా ఇతర అనేక దేశాల్లో 2020లో మనకంటే అతి తక్కువ నిరుద్యోగ రేటు నమోదు కావడం గమనించదగిన అంశం. బంగ్లాదేశ్ లో ఈ రేటు 5.3 శాతం కాగా, మెక్సికో లో 4.7 శాతం, వియత్నాంలో 2.3 శాతం. దేశంలో వేతన ఉద్యోగాల సంఖ్య దారుణంగా కుదించుకుపోయింది. కంపెనీల యాజమాన్యాలు అతి తక్కువమంది ఉద్యోగులతో సరిపెట్టుకొంటున్నాయని తెలుస్తున్నది. 2020 కరోనా లాక్‌డౌన్ వల్ల 15-23 ఏళ్ల వయసు యువ కార్మికులు నష్టపోయారని అజిమ్ ప్రేమ్ జీ వర్సిటీ అధ్యయనాల్లో తేలింది. యువశక్తిని గరిష్టంగా ఉపయోగించుకొనే స్థితిలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు రెండూ లేవని స్పష్టపడుతున్నది. కేంద్రంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు చిరకాలంగా భర్తీకి నోచుకోకుండా ఉన్నాయి. 10 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని మోడీ ఇటీవలనే నిర్ణయించారు. అదే సమయంలో పరిమిత చదువుల అసంఖ్యాక యువతకు ఆశాకిరణంగా ఉంటూ వచ్చిన సైన్యంలో శాశ్వత ప్రాతిపదిక రిక్రూట్మెంట్‌కు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులున్న రైల్వేను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తున్నారు. ఇది యువతకు నిరాశ కలిగించే పరిణామం. పని గంటలను పెంచడానికి, ఉద్యోగులను తొలగించడానికి యాజమాన్యాలకు అవకాశమిచ్చే కార్మిక సంస్కరణలు సైతం యువతపై పిడుగుపాటు వంటివే. మొత్తం కార్మిక శక్తిలో 2 శాతానికి మించినంత మంది మాత్రమే పిఎఫ్ లు, రిటైర్మెంట్ ప్రయోజనాలవంటి భద్రతలు కలిగిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతావారిలో ఎక్కువమంది అసంఘటితరంగంలో పని చేస్తున్నారు. దేశ ఆర్ధికవృద్ధి రేటు పెరుగుతున్నా అది ప్రజల బతుకుల్లో ప్రతిబింబించడం లేదు. వృద్ధిరేటులో అత్యధిక భాగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవారంగం నుంచే ఉత్పన్నమవుతున్నది. ఆ రంగాల్లో కేవలం ఉన్నత విద్యావంతులకే అవకాశాలుంటాయి. కీలకమైన తయారీ రంగం విశేషంగా పుంజుకొంటేగాని విస్తృత స్థాయిలో యువతకు ఉద్యోగాలు, ఉపాధులు లభించవు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా మన మేక్ ఐన్ ఇండియా వంటి పేరు గొప్ప పథకాలూ మన యువతకు ఏమీ చేయలేదని చెప్పుకోవలసి రావడం బాధాకరం.
Youth Population will Increase by 2023 in India