Saturday, December 21, 2024

బిజెపి తిరోగమన విధానాలు

- Advertisement -
- Advertisement -

ఈనాడు దేశంలో యువతను పట్టిపీడుస్తున్న రెండు ప్రధాన సమస్యలలో ఒకటి నిరుద్యోగ సమస్య, మరొకటి ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఈ రెండు సమస్యలు మనిషి గౌరవంగా తలెత్తుకొని బతకటానికి కావాల్సిన కనీస అవసరాలు. ప్రపంచంలో నేడు ఏ దేశానికీ లేనంత యువశక్తి భారత దేశానికి వరంగా ఉంది. వారిలో మెడిసిన్, ఇంజినీరింగ్, బిఇడి, ఎంఇడి చేసిన వారు, ఎంబిఎ, పిహెచ్‌డి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మొదలైన డిగ్రీ, పిజి. రీసెర్చ్ చేసిన లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు నిరుద్యోగులుగా, ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నారు. గత 9 ఏండ్ల పాలనలో 2023 జులై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014, 2015లో 5.44%, 2016లో 5.42%, 2017 లో 5.36%, 2018లో 5.33%, 2019లో 5.27%, 2020లో 8.00%, 2021లో 5.98%, 2022లో 7.33%, 2023 జులై నాటికి 7.95 శాతానికి నిరుద్యోగిత రేటు పెరుగుతూపోతున్నది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ప్రకారం మొత్తంగా నేటికీ దేశంలో నిరుద్యోగితా రేటు 7.95% ఉంది.
పట్టణ ప్రాంతంలో 7.93, గ్రామీణ ప్రాంతంలో 7.44% ఉంది. ఇలా అనేక మంది చదువుకున్న యువశక్తి ఒకవైపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక, వయసు మీద పడటంతో వివాహాలు చేసుకోవటం లేదు. పెండ్లి అయినవారు కుటుంబాలను పోషించలేక, ఇంటా, బయటా చీదరింపులు, యక్షప్రశ్నలు, అవమానాలు ఎదుర్కోలేక నిరాశా, నిస్పృహలతో బలవంతపు ఆత్మహత్యలు కూడా చేసుకొంటున్నారు. ప్రధాని మోడీ అంధభక్తులు మాత్రం అంతా సక్రమంగా, సజావుగా, అంతా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో కొనసాగుతున్నది అంటూ కొంత మంది అక్కడక్కడా తమ సొంత సోషల్ మీడియా గ్రూపుల్లో బాకాలు ఊదుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని కాగ్ నివేదికలు, ఆర్‌బిఐ, ప్రైవేట్ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు ప్రకటించిన గణాంకాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

పార్లమెంటులో గాని, మన్ కీ బాత్ రేడియో ప్రసంగాలలో గాని, బహిరంగ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసే ఉపన్యాసాల్లో గాని, దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ, ఉపాధి సమస్యలను మాత్రం ప్రస్తావించరు. కీలక సమస్యల విషయం వస్తే మాత్రం మోడీ మౌనం వహిస్తారు. ఇక పనికిరాని, అవసరం లేని హిందూత్వం, హిందూ మతోన్మాదం వంటి అంశాలలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మాత్రం రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇస్తారు. మన నిత్య జీవిత అనుభవాలతో సరిపోల్చి చూసుకున్నప్పుడు ఆయన చెప్పేమాటలు ఏవీ నమ్మదగినవిగా ఉండవు. దాదాపు అన్నీ అర్ధసత్యాలు, పూర్ణ అసత్యాలుగా మాత్రమే కనబడతాయి. ప్రతిసారి ఎన్నికల్లో మాటల గారడీ, లేనిపోని ఆశలు కల్పించడం తప్ప వాస్తవానికి ఆ మాటలు నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా కనిపించవు.

దేశ ఆర్ధిక పురోగతికి వెన్నెముక ఉద్యోగ, ఉపాధి రంగాలే కీలకం. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగం 47 ఏండ్ల గరిష్ఠానికి పడిపోయింది. 18- 25 ఏండ్ల లోపు పట్టభద్రుల్లో నిరుద్యోగిత గణాంకాలు చూస్తే ఏకంగా 42 శాతానికి చేరుకుంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలలో ఎక్కడ చూసినా నిరుద్యోగం, ఉపాధి కొరత విలయ తాండవం చేస్తున్నది. ఉన్నత చదువులు చదివిన వారికి వృత్తి నైపుణ్యాలు కొరవడినాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నూతన పెట్టుబడులు తిరోగమనంలో ఉన్నాయి. ముఖ్యంగా డీమానిటైజేషన్ ప్రభావం వ్యవసాయ రంగంలో పేలవమైన ఉత్పాదకతను చూపిస్తున్నది. ధనికులు మాత్రం విదేశీ బాటపడుతున్నారు. తమకు ఉపాధి దొరకదని నిరాశా, నిస్పృహలతో కుంగిపోయిన యువత కనీసం దరఖాస్తులు కూడా చేసుకోవడం లేదు. అంతగా యువతను మానసిక కుంగుబాటు గురిచేస్తున్నది ఈ ప్రభుత్వం అని ‘అజీజ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ’కి చెందిన ‘సెంటర్ ఫర్ స్టెయిన్‌బుల్ ఎంప్లాయిమెంట్ సంస్థ’ చేసిన సర్వే నివేదికలో బయటపడిన వాస్తవాలు తెలుపుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) విడుదల చేసిన ప్రకటనలోనూ ఈ సమస్య తీవ్రతను వెల్లడించింది. అయినా కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపై చీమకుట్టినట్లు కూడా లేదు.

2014 ఎన్నికల బిజెపి మేనిఫెస్టోలో చేసిన ప్రధాన వాగ్దానంలో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ దేశ యువత ఒకటికి రెండు సార్లు ప్రధాని మోడీ మాటలు విశ్వసించారు. కానీమోడీ ఎన్నికలకు ముందు చేసిన అతి ముఖ్యమైన హామీలను తేలికగా మరచిపోయారు. పదేండ్ల యుపిఎ హయాంలో యువతకు అన్యాయం జరిగిందని చెప్పి గద్దెనెక్కిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. ఈ లెక్కన 18 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే రావాలి. కానీ ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను సైతం మోడీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. పైగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలకూ కోతలు పెట్టారు. 2014 నాటికి 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16.9 లక్షల ఉద్యోగులు ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలతో పాటు ఇతర బడా కార్పొరేటు సంస్థలకే కట్టబెట్టడంతో ఉన్న ఉపాధి అవకాశాలు కూడా మాయమైయ్యాయి. మోడీ తన శక్తియుక్తులన్నీ కార్పొరేట్ వర్గాల ఎదుగుదలకే వినియోగించారు. వారి అడ్డుగోలు వ్యాపార దోపిడీకి, మోసాలకు అండగా నిలిచారు.

ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ‘మన్ కీ బాత్’లో మోడీ పాల్గొన్నా ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించింది చెప్పరు. ఏదైనా చేస్తేనే కదా చెప్పడానికి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలంటే విదేశీ, స్వదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడితే వస్తాయి. వాటి కోసం మోడీ ప్రభుత్వం చేసిన కృషి శూన్యం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఏవిషయానికి సంబంధించిన గణాంక వివరాలు ఉండవు. దేశంలో విద్యావంతులు ఎంత మంది? పేదరిక స్థాయి ఎలా ఉంది? కోవిడ్ మరణాలు ఎన్ని? ఉపాధి అవకాశాలు ఏ రంగంలో కల్పించారు? పోషకాహారం అందని శిశువులు ఎంత మంది? మొదలైన ఏ ప్రశ్నకైనా ప్రభుత్వపరంగా సరైన గణాంకాలు దొరకవు. ఈ వివరాలన్నీ ప్రైవేటు పరిశోధనా సంస్థలు, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ రిపోర్టులు, ఇతర అంతర్జాతీయ సంస్థల నివేదికల్లో, సూచీల్లోనే వివరాలు తెలుసుకోవాలి. ఆ లెక్కలు పక్కాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించి, బయటపెడితే అసలు రంగు తేలిపోతుంది.మన దేశంలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలంటే కనీస ఏటా 80 లక్షల చొప్పున కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచ బ్యాంకు నివేదిక గతంలోనే వెల్లడించింది.

దేశంలో ప్రతి నెలా 13 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. హోంగార్డులు, బస్ కండక్టర్లు, కానిస్టేబుల్ లాంటి చిన్నపాటి ఉద్యోగాల కోసం కూడా పిజిలు, పిహెచ్‌డిలు చేసిన వారు ఒక్కో పోస్టుకు వేల సంఖ్యల్లో పోటీపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు అధికంగా కేటాయించాలని దేశ, విదేశీ ఆర్ధిక రంగ నిపుణులు సూచించినా మోడీ ప్రభుత్వం లక్ష్యపెట్టదు. అచ్ఛేదిన్, ఉద్దీపనలు, ఆత్మనిర్బరతా అంటూ నినాదాలు, ప్రకటనలతో ఊదరగొడతారు. కోట్ల రూపాయల నిధులను మాత్రం కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్తలకు మాత్రం అప్పగించారు. వారి రుణాల ఎగవేతలపై చర్యలుండవు. వారి రుణాలను, వడ్డీలతో సహా మాఫీ చేస్తారు. తిరిగి వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకులపై వత్తిడి చేస్తారు. అంతే కాని, నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మాత్రం దారిచూపరు. వాటికి కేటాయించిన నిధుల్లో సగ మిచ్చినా ఎంతో మందికి ఉపాధి దొరికి దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది.

దేశ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, ధరలు పెరగకుండా చేయడానికి ఆర్‌బిఐలో పని చేసిన మాజీ గవర్నర్లు సలహాలు, సూచనలూ మోడీ ప్రభుత్వం వినిపించుకోదు. ఏవేవో కాకిలెక్కలు, కుంటిసాకులు మాత్రం చెబుతారు. మోడీ చుట్టూ విగ్రహారాధికులు, భజనపరులు చేరిపోయారు. ఆయన దృష్టి మొత్తం మీడియా కవరేజీ పైనే ఉంటుంది.ఎవరైనా దేశం ఎదుర్కొనే సమస్యలపై ప్రశ్నిస్తే వారంతా దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవులు, రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు జైళ్ళలో ఊచలు లెక్కపెడుతున్నారు. మోడీ పాలనలో చట్టాలు, రాజ్యాంగ స్వతంత్ర సంస్థలు సైతం మిన్నకుండవలసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, దర్యాప్తు సంస్థలు బిజెపి చెప్పుచేతల్లో నడవాల్సిందే. ఈ అనర్థాలకు కారణం ప్రజలు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టడం వల్లే అని గ్రహించాలి. రాబోయే ఎన్నికలలో ఈ యువతరం, దేశ ప్రజలు ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి,బిసి, మైనారిటీ ప్రజలు, మధ్యతరగతి వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. విజ్ఞత, వివేచన, విచక్షణ వారికే వదిలివేయాలి.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News