Thursday, December 19, 2024

ఆన్‌లైన్ గేమ్స్‌కు సచిన్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండే ఆన్‌లైన్ ఆటల్లో పాల్గొని యువత డబ్బులను పోగొట్టుకుంటున్న విషయం వార్తల్లో వస్తున్నదే.ఈ క్రీడలు మేధస్సు ఉపయోగించి ఆడేవి కాబట్టి జూదాలుగా పరిగణించి వీటిని నిషేధించలేమని కోర్టులు అభిప్రాయపడడంతో ఈ ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అవసరార్థం తండ్రి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలో వేస్తే ఆ ఖాతాలోని సొమ్ముతో ఆయన కొడుకు మొబైల్‌లో ఆన్‌లైన్ ఆటలాడి సుమారు రూ. 40 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ను పోగొట్టుకున్నాడని,ఆ విషయాన్ని తండ్రికి చెప్పలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పత్రికల్లో వచ్చింది.ఇలా ఆన్‌లైన్‌లో ఉండే రమ్మీ, క్రికెట్ లాంటి మోసకారి ఉచ్చులో పడి మన దేశంలోని లక్షలాది మంది యువకులు, విద్యార్థులు నిలువు దోపిడీతో పాటు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

తెలివి ఉన్నవారెవరైనా వాటి ఆశలో పడి మోసపోకండి అని చెబుతారు. మన సెలబ్రెటీలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. అలాంటి అపర జూదం ఆకర్షణలో యువకులు పడేలా సిద్ధం చేస్తున్న ప్రకటనల్లో, ప్రసార చిత్రాల్లో ప్రజాభిమానాన్ని చూరగొన్న నటులు, క్రీడాకారులు పాల్గొని ఈ బహిరంగ దోపిడీలోకి యువతను నెట్టేస్తున్నారు.అభిమాన నటుడు చెప్పాడనో, మహా ఆటగాడు దారి చూయించాడనో యువత ఆ వైపు నమ్మకంగా వెళుతోంది. అయితే చట్టపరంగా ఎలాంటి అభ్యంతరాలు లేనందువల్ల ప్రముఖ సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్లు ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలా, ఆర్థికంగా దెబ్బతీసే ఆన్‌లైన్ ఆటల వ్యాపార ప్రకటలో నటిస్తూ కోట్లాది రూపాయలు కూడగట్టుకుంటూ, వారి ధనాశకు దేశంలోని యువతను బలి తీసుకుంటున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు వారిని దేశ పౌరులు ఎంతో ప్రేమగా, గౌరవాభిమానాలు కురిపిస్తున్న వేళ, అదే పేరు ప్రఖ్యాతులను సొమ్ము చేసుకోడానికి ఈ సెలబ్రెటీలు తెగబడుతున్నారు.

బూస్ట్, పెప్సీల వ్యాపార ప్రకటనల్లో నటించి వాటి అమ్మకాలు పెంచితే సర్దుకోవచ్చు కాని పాన్ మసాలాలు భలే బాగుంటాయని, ఆన్‌లైన్ ఆటల మజా పొందండి అని హుషారుగా ప్రకటనల్లో కనిపిస్తే జనాభిమానాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుంది. జనం జై కొట్టినపుడే ధనరాశులు పోగెయ్యాలని అందరికీ ఉన్నా క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఉండడం వేరు. ఎందుకంటే ఆయన భారత రత్న స్వీకర్త. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమది. దానిని పొందినవారి ప్రతి చర్య ఆదర్శనీయంగా ఉండాలి, దేశ ప్రతిష్ఠను పెంచేలా ఉండాలి. భారత రత్నకు ఎంపికకు ముందు నుండే సచిన్ తన ఇమేజిని సొమ్ము చేసుకొనేలా ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు. 2014 లో ఆయనకు ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఇంత కాలం జీవితం వేరు, ఇక ముందు వేరు అని, తాను వ్యాపార ప్రకటనల్లో నటించే ముందు వాటి ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని సచిన్ అన్నారని ఆయన కార్యదర్శి వెల్లడించారు.

అయితే ఆ జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు. సెలబ్రెటీలు నటించకూడదు అని నిబంధనలున్న మ్యూచువల్ ఫండ్ యాడ్స్‌లో కూడా ఆయన నటించారు. ఇప్పటికి ఆయన 15 రకాల ఉత్పత్తుల, సేవల వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ, వాటి ద్వారా ఏడాదికి సుమారు రూ.150 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. ఆ వ్యాపార ప్రకటనల్లో పేటీఎం ఫస్ట్ గేమ్స్ అనే ఆన్‌లైన్ ఆటల యాప్ ఒకటి. ఈ యాప్ తెరవగానే రూ. 5తో లక్ష సంపాదించండి అని ఉంటుంది. ఇలాంటి ఆటల ద్వారా లక్షలు పోగొట్టుకున్నవాళ్ళే కానీ అయిదు రూపాయలు సంపాదించినవాళ్లు లేరు. ప్రకటన చివర్లో ఈ ఆట ఆర్థిక ఇబ్బందికారకమైనదని, జాగ్రత్తగా ఆడాలని, 18 ఏళ్ళుపై బడినవారు మాత్రమే ఆడాలని సూచనలుంటాయి.

కికెట్ దేవుడుగా ఎందరో అభిమానించే సచిన్ టెండూల్కర్ ఈ యాడ్‌లో నటించినందుకు ముంబైలో కొందరికి కోపం వచ్చింది. వారికి ప్రహార్ జనశక్తి అనే ప్రాంతీయ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడు ముందుండి నిరసన ప్రదర్శన నడిపించాడు. ఆ ప్రకటనను వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఫలితం లేకపోవడంతో ఆగస్టు రెండో వారంలో ఆ ప్రకటనలో సచిన్ నటించడం భారతరత్నకు అవమానకరమని, ఆగస్టు 30లోగా ఆ యాడ్ నుంచి తప్పుకోవాలని సచిన్ కు లీగల్ నోటీసు పంపించారు. దానికి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగస్టు 31న ముంబై, బాంద్రాలోని సచిన్ ఇంటి ముందు తమ నిరసనను చేపట్టారు. భారత రత్నను వాపసు చేసి మీ ఇష్టమొచ్చిన పని చేసుకోండని నినాదాలు చేశారు. ఆ ప్రకటన ద్వారా వచ్చే రూ. 300 కోట్లు ఆయనకు ప్రియమైతే భారత రత్నను ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ఆ గౌరవానికి ఉండే ప్రవర్తనా నియమావళిని పాటించాలని అన్నారు. మరాఠి, హిందీ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా ప్రసారమైంది. వీరి చర్యపై సచిన్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. చివరకు సచిన్ కు ఇచ్చిన భారత రత్నను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్రపతికి లేఖ రాసే పనిలో వారున్నారు.

సెప్టెంబర్ 2020లోనే న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫరెన్స్ కూడా ఈ విషయంలో సచిన్‌కు ఓ లేఖ రాసింది. పేటిఎమ్ ఫస్ట్ గేమ్స్ ప్రధాన భాగస్వామి చైనాకు చెందిన అలీబాబా అనే సంస్థ. ఇలా చైనా ఫండింగ్‌తో నడుస్తూ దేశ యువతను తప్పుదారిలో నడిపిస్తూ వారి సొమ్మును కొల్లగొడుతూ చైనాకు తరలిస్తున్న ఈ సంస్థ యాడ్ నుండి తప్పుకోవాలని ఆ లేఖలో కోరింది. సచిన్ నుండి వారికెలాంటి సమాధానం రాలే దు. పేటిఎమ్ ఫస్ట్ గేమ్స్ యాప్‌లో ఇలాంటి ఆటలు యాభైకి పైగా ఉన్నాయి. సుమారు 5 కోట్ల మంది భారతీయులు దీనిలో పాల్గొంటున్నట్లు దాని వెబ్‌సైట్‌లో ఉంది.ఇలాంటి యాడ్స్‌లో నటించడమే కాకుండా ఆదాయపు పన్ను చెల్లింపులోనూ సచిన్ కోర్టు వ్యాజ్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. తాను క్రీడాకారుడిని కాదు నటుడిని,

కళాకారులకు ఇచ్చే ఆదాయపు పన్ను రాయితీని తనకు కల్పించాలని ఆ శాఖను ఆయన కోరారు. తన జెర్సీపై ధరించే లోగోల ద్వారా వచ్చే ఆదాయం ఆ కేటగిరికే చెందుతుందని తీర్పు రావడంతో 2021లో రూ.6 కోట్ల ఆదాయంలో సుమారు రూ. 2 కోట్ల మినహాయింపు పొందారని వార్తల్లో వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన హాజరు, ప్రమేయం తక్కువే అని ఆ రోజుల్లోనే విమర్శలు వచ్చాయి. ప్రజాకర్షణ ఉన్నప్పుడు దాని ద్వారా ఆదాయాన్ని పొందడాన్ని ఎవరు ప్రశ్నించలేరు. అయితే మామూలు క్రీడాకారులు వేరు, భారత రత్నం వేరు. వ్యక్తి కన్నా దేశ ప్రతిష్ఠ ప్రధానం. పురస్కారాన్ని స్వీకరించడం కన్నా దాని గౌరవాన్ని కాపాడడం ముఖ్యం. క్రికెట్ వీరులైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని ఇలా ఇంకొందరు కూడా ఇలాంటి ఆన్‌లైన్ దొంగాటలకు జోరుగా ప్రచారం ఇస్తున్నారు. కీర్తి కనకాలతో తులతూగుతున్నా ఈ దుష్కర్మలకు పాల్పడడం కనీస మానవ ధర్మానికి భంగపాటు.ఇది వారి విజ్ఞతకు సంబంధించినది. విజ్ఞత ఉందని పద్మ, భారతరత్న పురస్కారాలు ఇస్తే స్వీకరించిన యెడల వాటి పరువు కాపాడక తప్పదు మరి. ఈ విషయంలో సచిన్ ప్రతి అడుగు ఆదర్శవంతంగా ఉండాలి లేదా ముంబై ఆందోళనకారుల కోరికనైనా తీర్చాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News