Wednesday, January 22, 2025

ప్రాణాలు తీస్తున్న వేగం

- Advertisement -
- Advertisement -

యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరు అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతిచెందినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలో మెహిదీపట్నంకు చెందిన యువకుడు చరణ్(19) బిఎన్‌ఆర్ హిల్స్ నుంచి రాయదుర్గం మీదుగా ఇంటికి కారులో వెళ్తుండగా వేగంగా వచ్చి షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ఢీకొట్టాడు. దీంతో డిగ్రీ చేస్తున్న చరణ్ అక్కడికక్కడే మృతిచెందగా,కారు తక్కు తుక్కు అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చరణ్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు కష్టపడాల్సి వచ్చింది.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఎపిలోని గుంటూరు జిల్లా, రొంపిచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బాలప్రసన్న కలిసి మసీద్ బండ నుంచి హఫీజ్‌పేట వైపు కొత్తగూడ ఫ్లైఓవర్‌పై నుంచి బైక్ వెళ్తున్నారు. ఫ్లైఓవర్‌పై బైక్‌ను వేగంగా నడపడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టడంతో అదుపు తప్పి ఇద్దరు కిందపడ్డారు. ఇద్దరు యువకుల తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గతంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పైన కారును అతివేగంగా నడపడంతో అదుపు తప్పి రేయిలింగ్‌ను ఢీకొట్టి కిందపడడంతో ఇద్దరు మృతిచెందగా, కారు డ్రైవింగ్ చేసిన యువకుడికి గాయాలయ్యాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు కారులో అతివేగంగా వెళ్లడంతో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టారు. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడ మృతిచెందాడు. ఇలా యువకులు మితిమీరిన వేగంతో వాహనాలను నడపడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

జరిమానాలు విధిస్తున్నా….
ఓవర్ స్పీడ్ వెళ్తున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నా కూడా వాహనదారులు మారడంలేదు. అతివేగంగా వాహనాలను నడుపుతున్న వారిలో ఎక్కువగా యువకులు ఉంటున్నారు. వీరే మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుతుండడంతో పోలీసులు ఓవర్ స్పీడ్ వెళ్లే వారిపై నిఘా పెట్టారు. స్పీడ్‌ను గుర్తించే పరికరాలను పోలీసులకు ఇవ్వడంతో వేగాన్ని గుర్తించి జరిమానాలు విధించి, కొంత వరకు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News