Monday, December 23, 2024

జల్సాలకు అలవాటు పడి.. చోరీలు చేస్తున్న యువకులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జల్సాలకు అలవాటుపడిన యువకులు డబ్బులు లేకపోవడంతో చోరీలు చేయడం సహజం. కాని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా పట్టుబడుతున్న వారిలో బైక్‌లు, ఆటోలు, టివిఎస్ ఎక్స్‌ఎల్‌ను దొంగిలిస్తున్న వారు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి. పట్టుబడుతున్న ముఠాల్లోని చాలామంది యువకులు వ్యసనాలకు బానిసలుగా మారారు. వారు చేస్తున్న ఉద్యోగానికి వస్తున్న డబ్బులు వీరి వ్యసనాలు తీర్చుకునేందుకు సరిపోవడంలేదు. దీంతో బైక్‌లను చోరీ చేయడం, వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ప్రారంభించారు. ఇలాంటి ముఠాలను పోలీసులు వరుసగా పట్టుకుంటున్నారు, చాలామంది యువకుల ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండడంతో జాల్సాలకు ఇంట్లో డబ్బులు ఇచ్చే వారు లేరు. దానికితోడు పెద్దగా చదువుకోకపోవడంతో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లేవు. దీంతో సులభంగా డబ్బులు రావాలంటే బైక్‌లను చోరీ చేయడం ఒక్కటే మార్గంగా నిర్ణయించుకున్నారు. దీంతో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్నారు.

ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా బైక్‌ల చోరీ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తును టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. వారు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటున్నారు. బైక్‌లను చోరీ చేస్తున్న వారిలో 25 ఏళ్లలోపు యువకులు ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలామందికి చిన్న వయస్సు నుంచి వ్యసనాలు అలవాటు అవుతున్నాయి. మందు, సిగరేట్లు, గంజాయి తదితర వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీలు బాటపడుతున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు బైక్‌లను చోరీ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఎండి సోహైల్, ఎంఇ ఫైజ్ కలిసి బైక్‌లను చోరీ చేస్తున్నారు. వీరికి మరో మైనర్ బాలుడు తోడయ్యాడు. ముగ్గురు కలిసి పార్కింగ్ చేసిన బైక్‌లకు డూప్లికేట్ కీతో తీసి చోరీ చేస్తున్నారు. చాదర్‌ఘాట్‌కు చెందిన ఎండి హైదర్, సియద్ అర్బాజ్ మెహింది బుకారీ, ఎండి అబ్దుల్ సమద్ కలిసి బైక్‌లను చోరీ చేస్తున్నారు. ముగ్గురి కుటుంబాలు కడు పేదరికంలో ఉన్నాయి. వీరు అంతంత మాత్రం చదువు కోవడంతో చిన్న చిన్న పనులు చేస్తున్నారు.

వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో బైక్‌లను చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన బైక్‌లను ఎండి అబ్దుల్ వద్ద పెట్టి విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులను ముగ్గురు కలిసి జాల్సాలు చేస్తున్నారు. ముగ్గురు నిందితులు కలిసి ఆరు బైక్‌లను చోరీ చేశారు. అబిడ్స్, మలక్‌పేట, నాంపల్లి, ఫిల్మ్‌నగర్, అల్వాల్, ఘట్‌కేసర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు బైక్‌లను చోరీ చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. ఇందులో ఒక బాలుడు ఉన్నాడు, ముగ్గురు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసలుగా మారారు. వ్యసనాలను తీర్చుకునేందుకు డబ్బులు లేకపోవంతో బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు. ముగ్గురు కలిసి ఏడు బైక్‌లను చోరీ చేశారు. ఖైరతాబాద్, ఐఎస్ సదన్, బండ్లగూడ, ఫలక్‌నూమ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బైక్‌ల చోరీల నిందితుల స్టోరీ వేరే విధంగా ఉంది. ముగ్గురు యువకులు చేపలు పట్టి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బులు వారి మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు సరిపోకపోవడంతో చోరీ చేయాలని ప్లాన్ వేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టివిఎస్ ఎక్స్‌ఎల్‌ను చోరీ చేశారు.

వాటిని విక్రయించి ముగ్గురు కలిసి జల్సాలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిందితులపై నిఘా పెట్టి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో బోరబండకు చెందిన ఓ వ్యక్తి నగరంలో ఆటో నడుపుతున్నాడు. ఇతడి స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడు, ఇద్దరు ఆటోడ్రైవర్ల కావడంతో వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలు, మద్యానికి సరిపోవడంలేదు. దీంతో పార్కింగ్ చేసిన ఆటోలను చోరీ చేయడం ప్రారంభించారు. ఇలా చోరీ చేసిన ఆటోల స్పేర్‌పార్ట్‌లను అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బులను ఇద్దరు కలిసి వ్యసనాలకు ఖర్చు పెట్టి జల్సాలు చేస్తున్నారు.

తక్కువ ధరకు విక్రయం…
బైక్‌లను చోరీ చేసిన నిందితులు అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. సచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా సగం ధరకు కొత్తబైక్‌లను విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులను తీసుకుని జాల్సాలు చేస్తున్నారు. ఇలా కొట్టిన బైక్‌ల విక్రయంతో వచ్చిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి చాలామంది బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేయడం కూడా నేరం, బైక్‌ల యజమానులు విక్రయిస్తేనే తీసుకోవాలి కానీ, తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి కొనుగోలు చేయవద్దు. ఇలా కొనుగోలు చేసి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.

మైనర్ నిందితులు…
గత కొంత కాలం క్రితం నుంచి ఎక్కడ బైక్‌లను చోరీ చేస్తున్న వారిని పట్టుకున్నా, అందులో బాలురు ఉంటున్నారు. చిన్న వయస్సులోనే వ్యసనాలకు బానిసలుగా మారిన బాలురు వేరే వారితో కలిసి నేరాలు చేస్తున్నారు. దీంతో వారి బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. బైక్‌లను చోరీ చేస్తున్న వారిని పట్టుకోగా, అందులో ఇద్దరు బాలురు ఉన్నారు. వారు కూడా బైక్‌లను చోరీ చేస్తున్నారు. వచ్చిన డబ్బులతో మద్యం, సిగరేట్లు, గంజాయికి బానిసలుగా మారుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News