Monday, December 23, 2024

యూట్యూబర్ ప్రాణం తీసిన అతివేగం: సూపర్‌బైక్‌లో గంటకు 300 కిమీ వేగంతో రైడింగ్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: డ్రెహ్రాడూన్‌కు చెందిన యూట్యూబర్ అగస్తే చౌహాన్ శుక్రవారం బైక్ ప్రమాదంలో మరణించాడన్న వార్త లక్షలాదిమంది ఆయన ఫాలోవర్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపైన ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న చౌహాన్ మోటారు సైకిల్ అలీగఢ్‌లోని తప్పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో 17 మైల్ పాయింట్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. ఆ దాటికి బైకు ముక్కలు ముక్కలు కాగా తీవ్రంగా గాయపడి చౌహన్ అక్కడికక్కడే మరణించాడు.
తన 1000 సిసి సూపర్‌బైక్ కవసాకి నింజా జెడ్‌ఎక్స్10ఆర్‌పై ప్రయాణిస్తున్న చౌహాన్ 300 కిలోమీటర్ల వేగంతో బైకును నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చౌహన్ వద్ద నుంచి లైవ్ స్టీమింగ్‌లో ఉన్న ఒక వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన యూట్యూబ్ చానల్ ప్రో రైడర్ 1000 కోసం అతను ఆ వీడియోను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. దాదాపు 12 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు అతని చానల్‌కు ఉన్నారు.

తన సూపర్‌బైక్ ఎన్నికిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లగలదో పరీక్షించడానికి ఢిల్లీకి ప్రయాణించనున్నట్లు చౌహాన్ అంతకుముందు అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో తెలిపాడు. తన సూపర్‌బైక్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళుతుందా లేక అంతకన్నా ఎక్కువ వెళుతుందా అనే విషయాన్ని తాను పరీక్షించనున్నట్లు అతను ఆ వీడియోలో చెప్పాడు.
రోడ్డు ప్రమాదంలో చౌహాన్ మరణించాడని అలీగఢ్ డిఐజి ఆనంద్ కులకర్ణి నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి పంపినట్లు ఆయన చెప్పారు. అతను ఓవర్ స్పీడ్‌లో వెళుతున్నాడని, అతని వద్ద నుంచి ఒక వీడియో స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News