మహబూబ్ నగర్: రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ తో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి అత్యాధునిక ఐసియు బెడ్ లు, ఆధునిక అత్యవసర వైద్య పరికరాలు సమకూరాయి. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన యువికెన్ పౌండేషన్ సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ వచ్చింది.
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన యువికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 50 క్రిటికల్ కేర్ బెడ్ లతో పాటు ఒక కోటి రూపాయల విలువైన ఇతర అత్యవసర వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి యువికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బెడ్ లను ప్రారంభించాలని ఫౌండేషన్ తెలంగాణ హెడ్ సృజన్ కుమార్ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో కలసి ఆహ్వానించారు. ఐసియు బెడ్ లను త్వరలోనే ప్రారంభించడానికి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. యువికెన్ ఫౌండేషన్ ను అభినందించారు. నిరుపేద , మధ్య తరగతి ప్రజలకు ఆధునిక వైద్యం అందించాలని సేవాభావంతో ఈ ఐసియు బెడ్ లను సమకూర్చిన ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఫౌండేషన్ సభ్యుల ద్వారా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కు చెందిన వెంకటేష్, ప్రసన్న, చరణ్, శివ లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలసిన వారిలో ఉన్నారు.