హైదరాబాద్ : వివేకా హత్య కేసులో రెండో పెళ్లి కీలక అంశమని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శుక్రవారం సిబిఐ విచారణ ముగిసిన తర్వాత హైద్రాబాద్ లో ఆయన మీడి యాతో మాట్లాడారు. వివేకానందరెడ్డికి రెండో పెళ్లి జరిగిందన్నారు. ముస్లిం మహిళను వివేకానందరెడ్డి 2005లో వివాహం చేసుకున్నా డన్నారు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడని చెప్పాడు. రాజకీయాల్లో తన వారసుడిగా అతడిని చేయాలని వివేకానందరెడ్డి భావించారని వివరించారు. తనపై ఉన్న ఆస్తులను కూడా రెండో భార్యపై రాయాలని భావించారన్నారు. ఆస్తులపై జరిగిన గొడవల వల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. వివేకా హత్య కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశమని అభిప్రాయపడ్డారు.
తాను టార్గెట్ గా వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణ సాగుతోందన్నారు. తనపై తన సోదరి సునీతమ్మ ఆరోపణలు చేసినా తాను మౌనంగా ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఈ విషయమై తాను మౌనంగా ఉంటే తమ పార్టీ క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొందన్నారు. అందుకే తాను ఈ విష యమై నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టుగా తాను ఎక్కడా చెప్పలేదన్నారు. వివేకా హత్య రోజున ఇంట్లో దొరికిన లేఖను సునీతమ్మ భర్త దాచిపెట్టాలని ఎందుకు చెప్పారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. తనపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉందని చెప్పారు. తన వైపు ఎలాంటి తప్పు లేదన్నారు. ఈ విషయమై తాను న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. సిబిఐ విచారణలో ఉన్నందున తెలంగాణ హైకోర్టు తీర్పు గురించి తనకు తెలియదన్నారు. మరోసారి విచారణకు పిలుస్తామని సిబిఐ అధికారులు తెలిపినట్టుగా చెప్పారు. సిబిఐ విచారణ తప్పుదోవ పడుతోందన్నారు.
కీలక విషయాలను పక్కనబెట్టి తనను విచారణకు పిలిచినట్టుగా చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. గురువారం తాను తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే తన సోదరి వైఎస్ సునీతారెడ్డికి సమాచారం ఇచ్చారని ఆయన సిబిఐపై ఆరోపణలు చేశారు. సిబిఐ లీకులు ఇస్తుందన్నారు. హత్యకు ముందు రోజున ఎంపి అభ్యర్ధిగా తనకు , ఎంఎల్‌ఎ అభ్యర్ధిగా రఘురామిరెడ్డికి ఓటేయాలని వివేకానందరెడ్డి ప్రచారం చేశారన్నారు. ఎంపి టికెట్ కోసం ఈ హత్య జరిగిందనే ప్రచారం హస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎనిమిది మంది సాక్షులు చెప్పిన మాటలను సిబిఐ పట్టించుకోవడం లేదన్నారు. వివేకానందరెడ్డి హత్యకు బెంగుళూరు సెటిల్‌మెంట్ కారణం కాదన్నారు.