అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో ఎందుకు మారుస్తున్నారని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వాలంటీర్లను ఎలా మోసం చేశారో, ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని, ఇప్పటి వరకు రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి పీఆర్సీ ఛైర్మన్ ను ఇంటికి పంపించేశారని మండిపడ్డారు. ఏ నెలలో ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పాలని జగన్ అడిగారు.
9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయని, 9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు అని, 9 నెలల్లో అమరావతి పేరు చెప్పి చేస్తున్న అప్పు రూ. 52 వేల కోట్లు అని విమర్శించారు. ఎపిఎండిసి ద్వారా మరో రూ. 5 వేల కోట్ల అప్పు చేశారని, 9 నెలల్లోనే ఏకంగా లక్షా 40 వేల కోట్లపైనే అప్పులు చేశారని, ఈ అప్పుడు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని నిప్పులు చెరిగారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్-6 పథకాలు అమలు చేశారా?, పేదలకేమైనా బటన్లు నొక్కారా? అని జగన్ దుమ్మెత్తిపోశారు.
ఇప్పుడు జరుగుతున్నది ఆర్థిక విధ్వంసం కాదా?, వైసిపి హయాంలో 4 పోర్టులు కట్టామని 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు చేశామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారని, బటన్ నొక్కడం గొప్పనా? ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అని చురకలంటించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా.. హామీలు గ్యారంటీ అని ఇంటింటికీ బాండ్లు కూడా పంచారని జగన్ దుయ్యబట్టారు.