ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఆ పత్రికలకు డెడ్‌లైన్ విధించారు. సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారని, తాను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశానని, వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరన్నారు.
ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం అని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని, టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు వాస్తవాల్ని వక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయన్నారు. ఆ కేసులో తన పేరు ఎక్కడా లేదని, కానీ ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయని, వాటికి లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హెచ్చరించారు.