Sunday, December 22, 2024

జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపు నిచ్చింది. మరోవైపు తిరుమల దర్శనా నికి వచ్చే భక్తులు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ నెలకొంది. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తామని బిజెపి నేతలు, హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘తితిదే ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారు. ఇది సరైందేనా?’ అని పరోక్షంగా వైసిపి అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎంపి స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత అనుచ రులతో కలిసి స్వామి వారి భజన చేసుకుంటూ

వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో తిరుపతి బాట పట్టారు. మరో వైపు తిరుపతి బిజెపి నేతలు జగన్ డిక్లరేషన్ ఇస్తేనే కొండపైకి రానివ్వాలని టిటిడి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కొద్ది రోజుల కిందట తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్దు బిజెవైఎం నేతలు హడావుడి చేశారు. జగన్ ఇంటిపైకి కాషాయ రంగు చల్లారు. జగన్ ఆ సమయంలో ఇంట్లో లేరు. బెంగళూరులో ఉన్నారు. లడ్డూ కల్తీ వివాదంలో జగన్‌పై హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి వారి దర్శనానికి వెళ్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. హిందూ సంఘాలకు చెందినవారు పెద్ద ఎత్తున తిరమలకు చేరుకుంటున్నారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలకు రావాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ లేకుండా వస్తే స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని ప్రకటించారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఇప్పటికే ఆరోపిం చారు. జగన్ తిరుమలకు వస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోన్న వేళ.. అక్కడికి వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేసినోళ్లను వదిలిపెట్టబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, జగన్ తిరుమల వెళ్లడం విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమమేనని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని నిరూపిస్తే వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తారని మాజీ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.. తిరుపతి లడ్డూ విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడితో ఆటలు వద్దు అని హెచ్చరించారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఇటువంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.

పర్యటన ఏర్పాట్ల ఊసే లేదు…!
జగన్ తిరుమల పర్యటనకు వైసిపి నేతలు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆయన దర్శనం కోసం ముందుగా టిక్కెట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. నడక మార్దం ద్వారా తిరుమకు జగన్ వెళ్తారని ప్రచారం జరుగుతోంది కానీ, వైసిపి వర్గాలు ధృవీకరించడం లేదు. ఇరవై ఏడో తేదీన ఆయన ఏ సమయంలో తిరుమల చేరుకుంటారు.. ఇరవై ఎనిమిదో తేదీన ఏ సేవలో పాల్గొంటారు అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే జగన్ పై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న కారణంగా డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు రావాలని లేకపోతే దర్శనానికి అనుమతించ బోమని టీడీపీ వర్గాలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News