అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల గురువారం ఉదయం నుండి ఇందిరాపార్క్‌వద్ద దీక్షకు ను ప్రారంభించారు. ఈక్రమంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే తనకు మూడు రోజులపాటు దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరడంతో వారు నిరాకరించారు. పోలీసుల బలవంతం మీద దీక్షా స్థలం వద్ద నుండి కదిలారు. అయితే ఆమె పాదయాత్రగా అక్కడి నుండి బయలుదేరడంతో కొంత దూరం మేర ఆమెను వారించడానికి చూసిన పోలీసులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం కలగడం లేదని ఆమె ప్రశ్నించారు. అయితే నిజానికి తాను ముందుగా ప్రకటించినట్టుగా 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. తన 72 గంటల దీక్ష పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు మద్దతుగా జిల్లాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు. షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.
పాదయాత్ర భగ్నం: ఇందిరాపార్క్ దీక్ష తర్వాత ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన వైఎస్ షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల దురుసుప్రవర్తనతో ఆమె ఒక దశలో స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.