Thursday, January 23, 2025

షర్మిల అరెస్ట్.. బెయిల్

- Advertisement -
- Advertisement -

షర్మిల అరెస్ట్.. బెయిల్
ప్రగతి భవన్ ముట్టడి యత్నం భగ్నం
పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి
ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతిభవన్‌వైపు రాక
పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి షర్మిల కారు నిలిపివేత
కారులోనే కూర్చొన్న షర్మిల.. కారు దిగాలని పోలీసుల వినతి
అయినా కారులోనే షర్మిల-క్రేన్‌తో ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిలను మరోసారి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారులో కూర్చొని కిందికు దిగేందుకు నిరాకరించడంతో కారుతో సహా క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి పోయారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆమెను హైదరా బాద్ తరలించారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రచారరథానికి నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు.

షర్మిల మంగళవారం పోలీసుల కళ్లు గప్పి లోటస్ పాండ్ నుంచి ఆ వాహనాలను తీసుకుని ప్రగతి భవన్‌కు బయల్దేరారు. ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుం టూ షర్మిల ప్రగతి భవన్‌వైపు వచ్చారు. అయితే సమాచారం అందడంతో పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి పోలీసులు షర్మిల వాహనాల ను నిలిపివేశారు. పంజాగుట్ట-సోమాజీగూడ మార్గంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వైఎస్‌ఆర్‌టిపికి చెందిన 15 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా అదుపులోనికి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కారు అద్దాలను క్లోజ్ చేసి షర్మిల అందులోనే కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ కారణంగా ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసుల క్రేన్ సహా యంతో షర్మిలను ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ ముందు కారులోనే షర్మిల కూర్చున్నారు. కారు నుండి దిగాలని కోరినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. దీంతో కారు డోర్ లాక్‌ను పగులగొట్టి అందులో ఉన్న వైఎస్‌ఆర్‌టిపి నేతలను బయటికి దింపారు. ఆ తర్వాత షర్మిలను కారు నుండి బయటకు తీసుకు వచ్చారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లోనికి మహిళా పోలీసులు షర్మిలను తీసుకెళ్లారు.

ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న షర్మిలను విడుదల చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంపైకి ఎక్కిన కొందరు ఆందోళనకు దిగారు. షర్మిలను విడుదల చేయకపోతే తాము భవనం పైనుండి కిందకు దూకుతామని హెచ్చరించారు. మరోవైపు పోలీస్‌స్టేషన్ వద్ద ఎవరూ ఉండవద్దని పోలీసులు కోరారు. పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చిన వారిని పంపిచేశారు. షర్మిల పాదయాత్రకు అనుమ తివ్వాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న భవనంపై ఆందోళనకు దిగిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షర్మిలను పరామర్శించిన బ్రదర్ అనిల్
వైఎస్ షర్మిల అరెస్టయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త బ్రదర్ అనిల్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లి వైఎస్ షర్మిలను పరామర్శించారు.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు
వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై షర్మిల హంగామా చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 353,333,327 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. వైఎస్ షర్మిల కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

షర్మిలతో పాటు ఐదుగురిపై 143,341,290,506,509,336,353,382,149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమాజీగూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిల అరెస్ట్ విషయాన్ని భర్త అనిల్‌కు పోలీసులు తెలిపారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రశ్నించారు. షర్మిల ఏ నేరం చేసిందని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారని, కేసులపై న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిలతో పాటు మరో ఐదుగురిని పోలీసులు తరలించి జడ్జి ఎదుట హాజరుపర్చారు. వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచికత్తుపై షర్మిలకు బెయిల్ మంజూరైంది. షర్మిలతో పాటు ఐదుగురికి బెయిల్ లభించింది.

పోలీసులు మాకేం కొత్తా.. షర్మిల అరెస్ట్‌పై విజయమ్మ
లోటస్‌పాండ్‌లోని నివాసంలో విజయమ్మ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే ఆమరణ నిరాహారదీక్షకు దిగిన విజయమ్మ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో వున్న తన కుమార్తె వైఎస్ షర్మిలను కలిసేందుకు విజయమ్మ బయల్దేరారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో లోటస్‌పాండ్‌లోని నివాసంలోనే విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగినట్లు తెలుస్తోంది. తనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను చూడటానికి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని విజయమ్మ ప్రశ్నించారు. తనను వెళ్లనీయకుంటే దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా.. పోలీసులు ఇలా చేయడం తప్పు కాదా అని విజయమ్మ ప్రశ్నించారు.

షర్మిల దేనికి భయపడే రకం కాదని ఆమె తేల్చి చెప్పారు. తన కూతురికి తోడుగా వుండేందుకు వెళ్తానన్నానని, పోలీసులు ఒప్పుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోందన్నారు. కెసిఆర్‌పై షర్మిల ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని విజయమ్మ తేల్చి చెప్పారు. షర్మిల చేసిన నేరం ఏంటన్న ఆమె.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? అని ప్రశ్నించారు. మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. తమకు పోలీసులు కొత్త కాదని విజయమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు.
ఆమె నిర్ణయాలపై మేం స్పందించం.. కాని షర్మిల అరెస్ట్ బాధాకరం: సజ్జల వ్యాఖ్యలు
వైఎస్‌ఆర్‌టిపి చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసిపి నేత, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. అయితే షర్మిల రాజకీయ నిర్ణయాలపై తాము వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని షర్మిలకు కోర్టు సూచించింది. సిఎం కెసిఆర్‌పై ఎలాంటి రాజకీయపరమైన, మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు షరతు విధించింది. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలంటూ వైఎస్‌ఆర్‌టిపి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. 3,500 కిలోమీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని వైఎస్‌ఆర్‌టిపి తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టిఆర్‌ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. ఈ పిటిషన్‌పై పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News