అమరావతి: షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలుసునని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని విమర్శలు గుప్పించారు. బుధవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. సంబంధం లేదని జగన్‌కు తెలుసు కాబట్టే షేర్ల విక్రయం, సంతకాలు చేశారన్నారు. ఇడి అటాచ్ చేసింది షేర్లు కాదు అని, రూ.32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి అని వైఎస్ షర్మిల తెలియజేశారు. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు అని, స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదు అని, గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఇడి అటాచ్ చేసిందని, అటాచ్ చేసిన వాటి షేర్లను స్టాట్‌మార్కెట్ లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదన్నారు.
ఇడి అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదమన్నారు. తనకు వంద శాతం వాటాలు బదలాయిస్తామని ఎంఒయుపై సంతకం చేశారని, బెయిల్ రద్దవుతుందని సంతంక చేసినప్పుడు తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాల్టీ, సండూర్, సరస్వతి షేర్లను ఎలా అమ్మారని అడిగారు. విజయమ్మకు రూ.42 కోట్లకు షేర్లు ఎలా అమ్మారని నిలదీశారు. జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసునన్నారు. బెయిల్ రద్దవుతుందని షేర్లు విక్రయించినప్పుడు తెలియదా? అని షర్మిల చురకలంటించారు. షేర్లు అమ్మడం స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. షేర్లు విక్రయించి ఇప్పుడేమో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.