హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు. షర్మిల మంగళవారం ఉస్మానియా ఆస్పత్రి సందర్శనకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, వైతెపా కార్యకర్తల మధ్య తొపులాట జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ… నేతలు ఎక్కడికి వెళ్లకుండా గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితులు లేవని ఆమె ఆరోపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో టవర్స్ నిర్మిస్తామని కెసిఆర్ అన్నారు. రూ. 200కోట్లతో కొత్త భవనం నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. హామీ ఇచ్చి 8ఏళ్లు గడిచినా ఉస్మానియా ఆస్పత్రి అలాగే ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడితే గృహనిర్బంధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.