Monday, December 23, 2024

రాహుల్‌కు షర్మిల జన్మదిన శుభాకాంక్షలు: ఇక విలీనమే తరువాయి ?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్‌టిపి) అధినేత్రి వైఎస్ షర్మిలా సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాముల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. దేశ ప్రజల తరఫున అవిశ్రాంతంగా పోరాడుతున్న మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీకి షర్మిల ట్వీట్ చేశారు.

ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపి విలీనం అవుతుందంటూ ఊహాగానాలు జోరుగా రాజకీయ వర్గాలలో సాగుతున్నాయి. విలీనం ఒఒప్పందంపై షర్మిల, కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే అందుకు ప్రతిగా ఆమె సన్నిహిత మద్దతుదారులు కొందరికి కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల తాను ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఆమెతోపాటు మరికొందరు ఆమె సన్నిహితులకు కూడా కాంగ్రెస్ టిక్కెట్లు లభించే అవకాశం ఉంది.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి కెపిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను షర్మిల కలుసుకోవడంతో రెండు పార్టీల విలీనంపై సాగుతున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తాజాగా మే 29న రెండవసారి బెంగళూరులో డికె శివకుమార్‌తో సమావేశమైన షర్మిల కర్నాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో డికె పాత్రను ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చడానికి డికె శివకుమార్‌ను పార్టీ అధిష్టానం రంగంలోకి దించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో ఉన్న చిన్న పార్టీలను విలీనం చేసుకుని, పార్టీని వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని డికె శివకుమార్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, ఆయన కుటుంబంతో డికె శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన తండ్రి వైఎస్‌ఆర్ రాకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్న షర్మిలతో కలసి పార్టీని అధికారంలోకి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News