మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించి.. అరెస్టై, బెయిల్ మీద బైటికి వచ్చిన వైఎస్సార్‌టిపి అధినేత వైఎస్ షర్మిలపై టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత తొలిసారిగా స్పందించారు. ఆమె మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘తాము వదిలిన బాణం. తానా అంటే తందానా అంటున్న తామరపూలు” అంటూ బిజెపిని, షర్మిలను ఉద్దేశిస్తూ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. వైఎస్సార్‌టిపి బిజెపి అనుకూల పార్టీ అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కవిత ట్వీట్‌పై షర్మిల స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవలేదని షర్మిల విమర్శించారు.
షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ‘అమ్మా.. కమల బాణం .. ఇది మా తెలంగాణం… పాలెవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం, మీకు మొన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు.. మీరు కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారెట్టు.. మీలాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాక రాలేదు నేను… ఉద్యమంలో పుట్టిన మట్టి ’కవిత’ను నేను’ అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.
YS Sharmila is BJP Convert: MLC Kavitha