Monday, December 23, 2024

కాంగ్రెస్ వైపు షర్మిల చూపు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నాయి.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజులు దగ్గర పడుతున్నకొలదీ అధికారమే లక్షంగా రాజకీయ పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమవుతున్నాయి. నియోజకవర్గాల్లో కూడా ఆశావహులు విజయావకాశాల కోసం సురక్షితమైన పార్టీలవైపు దృష్టి సారిస్తునారు. ఈ నేపధ్యంలోనే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలా రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పుడు ఆమె చూపు కాంగ్రెస్ వైపు ఉందనేకంటే కాంగ్రెస్‌పార్టీ అధిష్టానమే షర్మిల వైపు చూస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో షర్మిలకు బలమైన పార్టీ అవసరం ఎంత ఉందో , పార్టీకి కూడా షర్మిల వంటి చరిష్మా ఉన్న నేత అవసరం కూడా అంతే ఉందంటున్నారు. ఈ కోవలోనే షర్మిలను హస్తం చేతిలో పెట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ అధిష్టానంతో ఆ పార్టీ సీనియర్ నేత , వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మగా చెప్పుకునే కేవిపి రామచంద్రరావు దౌత్యం చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దల తనయగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న షర్మిల తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియని కొత్తముఖమేమి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌కు తెలుగు రాష్ట్రాల్లో బలమైన వర్గం ఉంది. అంతకు మించిన అభిమాన జనం ఉంది. అందుకే ఆయన బిడ్డ షర్మిలా రెడ్డి రాజకీయ అరంగ్రేటం సునాయాసంగానే జరిగిపోయింది. రాజకీయంగా తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకోవటం ఆమెకు సులువుగానే జరిగిపోయినా , అంతకు మించిన రీతిలో అమే పట్టుదల , కార్యదీక్ష కూడా అందుకు దోహదపడ్డాయి. తన సోదరుడు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనల ఆరోపణలపైన సిబిఐ కేసులతో ఆరెస్టయి నెలల తరబడి జైల్లో ఉన్న పరిస్థితుల్లో షర్మిల చూపిన తెగువ ఆమెలో దాగివున్న రాజకీయ కరుకుతనం బయటకు వచ్చింది. 2014 ఎన్నికల నాటికంటే ఎంతో ముందుగానే ఆమె పాదాయాత్రను చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేశారు. ఊరూరా ప్రజలతో మమేకం అయ్యారు .

వైసీపిలో ఏ విధమైన పార్టీ పదవులు కూడా చేపట్టని షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి సారించారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో లో పాద్రయాత్రలు నిర్వహించి తన రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ ప్రజల ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నం చేశారు. అధికార పార్టీపైనే పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఒక మహిళగా ,పార్టీ అధినేత్రిగా రాజకీయ పార్టీని నడిపించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిలకైనా మరోకరికైనా అంత సులువైన పనికాదు . గత రెండు నెలలుగా షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం.. ఆ ప్రభావం తెలంగాణ రాజకీయరంగంపైన కూడా పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కీలక నేతగా వ్యవహరించిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ వైఎస్‌కుటుంబానికి సన్నిహితులు కావటంతో షర్మిల బెంగూళూరు వెళ్లి శివకుమార్‌ను అభినందివచ్చారు.

ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారని, ప్రియాంకగాంధీతో చర్చలు జరిపారని కధనాలు వెలువడ్డాయి.అయితే వీటిపట్ల షర్మిల మీడియా సమావేశంలో స్పందించారు. కేవిపి రామచంద్రరావు ద్వారా కాంగ్రెస్‌పార్టీ షర్మిలతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేవిపి దౌత్యం ఫలిస్తే త్వరలోనే షర్మిల కూడా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్నేహ హస్తం అందుకోవటం ఖాయం అంటున్నారు. అయితే ఈ దౌత్యంలో ఎటువంటి షరతులు ఉంటాయి. షర్మిల తన పార్టీని విలీనం చేస్తారా, లేక పొత్తు వరకే పరిమతం అవుతారా, కాంగ్రెస్‌పార్టీ షర్మిలను తెలంగాణలో ఏవిధంగా ఉపయోగించుకుంటుంది అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News