రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి పార్టీలే బాధ్యత వహించాలని వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. తన సోదరుడు జగన్ పైనా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన జగన్… సిఎం అయ్యాక ఆ సంగతి మరచిపోయారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై అవిశ్వాసం పెడతాననీ, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని అన్నారని చెబుతూ సిఎం అయ్యాక ప్రత్యేక హోదాకోసం జగన్ ఒక్కసారి కూడా ఉద్యమించిన దాఖలాలు లేవన్నారు. విజయవాడకు మెట్రో రైలు తేలేకపోయారు. ఈ పదేళ్లలో కనీసం పది పరిశ్రమలైనా తీసుకురాలేకపోయారని షర్మిల అన్నారు.
గత పదేళ్లలో అప్పులు పది లక్షలకోట్లకు పెరిగాయనీ, అప్పులు పెరిగినా అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతోందన్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని షర్మిల చెప్పారు.