Sunday, December 22, 2024

జగన్ చెబుతున్నవన్నీ కుటుంబ ఆస్తులే:షర్మిల

- Advertisement -
- Advertisement -

ఏపీ మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాల్సిన బాధ్యత ఆయనదే. ఇది రాజశేఖర్ రెడ్డి మ్యాండేట్. వైఎస్సార్ ఈ ఉద్దేశం ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి సహా సన్నిహితులందరికీ స్పష్టంగా తెలుసు. నాన్న బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కు సమాన వాటా ఉండాలన్నది వైఎస్‌ఆర్ మ్యాండేట్. ఈరోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. 2021లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టా.

జగన్‌కు ఇష్టం లేకుండా వచ్చానని కోపమొచ్చింది. రాజకీయాల్లో నన్ను అణచి వేసేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే అవమానించారు. సోషల్ మీడియాలో నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ప్రజల్లో అమ్మపై కేసు వేసిన దుర్మార్గుడనే పేరు వస్తుందని మాట మార్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నామనే అభియోగం మోపారు. నిజానికి బెయిల్ రద్దు కాదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ కాలేదు. కంపెనీల్లో ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు. రూ.32కోట్ల విలువైన భూములనే. షేర్ల బదిలీకి, ఆయన బెయిల్ రద్దుకు ఎలాంటి సంబంధం లేదు. సొంత తల్లిని కోర్టుకు ఈడ్చడం.. ఆ తల్లికి ఎంత అవమానం? అమ్మను బాధపెట్టొద్దని, అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి బయటపెట్టలేదు. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ కారణమని ఎందుకు అనుకోకూడదు? నేను జగన్‌కు లేఖ రాస్తే..

అది తెదేపా సోషల్ మీడియా ఖాతాలో పోస్టయితే నాకేంటి సంబంధం? నేను కానీ.. నా మనుషులు కానీ బయటపెట్టలేదని బైబిల్‌పై ప్రమాణం చేస్తా. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదు. నా గురించి తెలియాలనే వాస్తవాలను మీ ముందుంచుతున్నా. కుటుంబ బంధం, స్నేహబంధంతో మనుషులు ఒక్కటవుతారు. ‘వైఎస్సార్ బంధం’ ఏర్పరచుకున్న ప్రతి వైఎస్సార్ బంధువుకి వివరణ ఇస్తున్నా. అమ్మను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దనే వాస్తవాలు చెబుతున్నాఅని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News