Saturday, November 23, 2024

ఇంకెంతకాలం విచారణ

- Advertisement -
- Advertisement -

వివేకా హత్య కేసుపై సుప్రీం సీరియస్ , విచారణ అధికారిని మార్చాలని సిబిఐకి ఆదేశం, దర్యాప్తు తీరుపై అసహనం

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని సుప్రీం ప్రశ్నించింది. కేసు అంతా… రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. హత్యకు గల ప్రధాన కారణా లు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులు మార్చాలని కోరు తూ వివేకా హత్య కేసులో ఎ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. విచారణాధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసిం ది.

అలాగే ఇప్పుడున్న అధికారి రామ్‌సింగ్ కూడా కొనసాగుతారని తెలిపింది. దర్యాప్తు అధికారిని మారిస్తే విచారణలో జాప్యం జరుగుతుందని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయగా.. దర్యాప్తు త్వరగా జరగాలన్నదే తమ ఉద్దేశమని.. ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి కొనసాగుతూ నే, అదనంగా మరో అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ చివరిలోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సిబిఐ కోరినందున వారికి ఒక అవకాశం ఇవ్వాలని.. సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో స్పందించిన సిబిఐ న్యాయవాది.. తాము ఆమె విజ్ఞప్తిపై ఆధారపడటం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇక్కడ ఆరోపణలు కాదని, దర్యాప్తు వేగంగా జరగాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించారు. తదుపరి దర్యాప్తు వేగంగా జరగాలనే వాదనను స్వాగతించాలని.. సునీత తరపు న్యాయవాదికి సూచించారు. సిబిఐ.. ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని.. తమకు పూర్తి విశ్వాసం ఉందని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సిబిఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం

సిబిఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక చదివామని ధర్మాసనం పేర్కొంది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని.. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. తదుపరి దర్యాప్తు పూర్తిచేసి హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చక పోతే ట్రయల్ జరగదని న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. సిబిఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. హత్య కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన నిర్ధేశాలు తీసుకుని చెప్పాలని సంస్థ తరపు న్యాయవాదికి సూచిస్తూ… విచారణ వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News