అమరావతి: ఎన్ టిఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారని జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోతాయా? నిలదీశారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలు తగిన విధంగా లేవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో తగినన్ని పడకలు, సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఔషధాలు ఉండవని, కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ ను వేధించారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మానసిక వ్యాధికిలోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి… విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదన్నారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే కొత్త వివాదాలు సృష్టించేందుకే వైసిపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. పేర్లు మార్చాలి అనుకుంటే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా? పవన్ కల్యాణ్ అని ప్రశ్నించారు.
ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉందని, స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కెజిహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని సూచించారు. బోధకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త యల్లాప్రగడ అని, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు పేరుని కనీసం ఒక్క ఆస్పత్రికైనా ఈ పాలకులు పెట్టారా? అని నిలదీశారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు – ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహానీయుల గురించి పాలకులు తెలుసుకోవాలన్నారు.