అమరావతి: మరో రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీ వైసిపికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. మరికొందరు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. బుధవారం విజయవాడ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు సమాచారం.
అనంతరం ఆయన సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా స్పందించారు. ప్రస్తుతం వంశీకృష్ణ వ్యవహారం విశాఖపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జివిఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన వంశీ మేయర్ పదవిని ఆశించారు.
అయితే సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయనకు కాకుండా.. హరి వెంకటకుమారికి మేయర్ పదవి ఇచ్చారు సిఎం జగన్. అప్పటి నుంచి వైసిపి హైకమాండ్‌పై వంశీకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఆయనకు అవకాశం కల్పించారు. ఎన్నికల్లో సులభంగా గెలిచిన వంశీకృష్ణ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.