బరోడా: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని యూసుఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యూసుఫ్ పఠాన్ కూడా ఇర్ఫాన్ బాటలోనే నడుస్తూ ఆటకు వీడ్కోలు పలికాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు మరో పేరుగా చెప్పుకునే యూసుఫ్ పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. 2007లో ట్వంటీ20 ప్రపంచకప్ సాధించిన జట్టులో కూడా యూసుఫ్ ఉన్నాడు. అంతేగాక 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గిన టీమిండియాకు యూసుఫ్ పఠాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఇలా తన కెరీర్‌లో రెండు వరల్డ్‌కప్‌లను అతను సాధించాడు. 38 ఏళ్ల యూసుఫ్ పఠాన్ తన కెరీర్‌లో 57 వన్డేలు, మరో 22 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1046 పరుగులు, మరో 46 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఐపిఎల్‌లో కూడా పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపిఎల్ ఆరంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ సాధించడంలో యూసుఫ్ పఠాన్ కీలక పాత్ర పోషించాడు. అంతేగాక కోల్‌కతా ఐపిఎల్ చాంపియన్‌గా అవతరించడంలో కూడా తనవంతు సహకారం అందించాడు. ఐపిఎల్‌లో మొత్తం 174 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 3204 పరుగులు చేశాడు. అంతేగాక బంతితోనూ రాణించి 42 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దేశవాళి క్రికెట్‌లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
గర్వంగా భావిస్తున్నా
ఇక టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు యూసుఫ్ పఠాన్ వెల్లడించాడు. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నాడు. 2007 టి20, 2011 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉండడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన తర్వాత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను భుజాలపై మోయడం తన కెరీర్‌లోని గొప్ప క్షణాల్లో ఒకటని వివరించాడు. ఇక తనకు అవకాశాలు ఇచ్చిన బిసిసిఐకి, ఐపిఎల్ యాజమాన్యాలకు, బరోడా క్రికెట్ సంఘానికి యూసుఫ్ పఠాన్ ధన్యవాదాలు తెలిపాడు.
ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అలా అని ప్రపంచకప్, ఐపిఎల్ వంటి ప్రధాన టోర్నీల ఫైనల్స్ జరుడం లేదు. అయినా ఈ రోజు తనకు చాలా ముఖ్యమైంది. ఈ రోజుతో క్రికెట్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలుకుతున్నాను. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇక సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలను తాను అందుకున్నానన్నాడు. తనకు అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులకి అభిమానులకి, కోచ్‌లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరోవైపు ఆటకు వీడ్కోలు పలికినా తన అకాడమీ ద్వారా యువ ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తానని యూసుఫ్ వివరించాడు.