Monday, December 23, 2024

బిజెపిలో జహీరాబాద్ నేతల చేరిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అధికారం ఉందని బరితెగించొద్దు.. భవిష్యత్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బిఆర్‌ఎస్‌ను కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమక్షంలో.. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డిసిసిబి ఛైర్మన్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్‌కు చెందిన పలువురు మాజీ ఎంపిపిలు, జడ్పిటిసిలు, సర్పంచ్, ఎంపిటిసిలు, పలువురు ప్రజాప్రతినిధులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బాగారెడ్డికి, మెదక్ జిల్లాకు విడదీయరాని సంబంధం ఉందని. ఆయనో తిరుగులేని నేత అని పేర్కొన్నారు. బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే పార్టీలో చేరారని, కాగా ఇప్పుడు ఆయన అధ్వర్యంలో మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతున్నట్లుగా వెల్లడించారు.

బిఆర్‌ఎస్ పాలనలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ హయాంలోనూ వారికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పేదలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా న్యాయం జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు బిజెపి నేతలు వెళ్తే .. ముఖ్యమంత్రికి అంత ఉలుకెందుకని కిషన్ రెడ్డి -ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలకు అన్ని పథకాలు అందినట్లయితే సిఎం ఎందుకు భయపడుతున్నట్లని నిలదీశారు. గజ్వేల్ ఏమైనా కెసిఆర్ ప్రైవేట్ ఆస్తా? అక్కడికి వెళ్తే అడ్డుకునే హక్కు ఆయనకు లేదన్నారు.

తెలంగాణ రైతులు అమాయకులు అనుకోవద్దని, రైతుల శక్తి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారన్నారు. కాంగ్రెస్ హయాంలో కమిషన్లు తీసుకుంటే.. బిఆర్‌ఎస్ హయాంలో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కెసిఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. ఈ నెల 17 న ప్రధాని మోడీ జన్మదినాన్ని ఘనంగా జరుపుతామని, అదే రోజు సెప్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కింది స్థాయి నేతలు చాలా మంది బిజెపిలో చేరుతున్నారని, జహీరాబాద్. నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్‌చెరువులో చాలామంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో సభలు పెట్టి చేర్చుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో చేరే వారికి గుర్తింపు దక్కేలా స్థానిక సెగ్మెంట్లలోనే సభలు నిర్వహిస్తామని ఈటల స్పష్టం చేశారు.

 Zaheerabad leaders join BJP

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News