న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి ఔషధ కంపెనీ జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ డోస్ ధరను రూ.265గా నిర్ణయించేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని అధికారికవర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెల్లడవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ జైకోవ్‌డి అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతి ఇచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ను వాడుకలోకి తెచ్చేందుకు నిపుణుల కమిటీ సిఫారసు చేయాల్సి ఉన్నది. దేశంలో తయారైన మొదటి డిఎన్‌ఎ వ్యాక్సిన్ ఇది. అంతేగాక ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి సూది అవసరం లేదు. నొప్పి లేకుండా జెట్ ఇంజెక్టర్ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు. జెట్ ఇంజెక్టర్‌కు అదనంగా రూ.93 చెల్లించాలి. దాంతో, ఈ వ్యాక్సిన్ డోస్ ధర రూ.358 అవుతుంది. 12 ఏళ్లు, ఆపై వయసువారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతి పొందింది. ఇది మూడు డోసుల వ్యాక్సిన్. ఇప్పటివరకు అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్‌వి రెండు డోసుల వ్యాక్సిన్లు.