శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ
అమెరికాలో తుదిశ్వాస తబలాతో
యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను
చేసిన హుస్సేన్ సంగీత, సాంస్కృతిక
రాయబారిగా పేరు ప్రఖ్యాతులు ఐదు
గ్రామీ అవార్డులు, పద్మవిభూషణ్ లాంటి
ఎన్నో పౌరపురస్కారాలు ఆయన సొంతం
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ,
సిఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు , పద్మవిభూషణ్ గ్రహీత జాకిర్ హుస్సేన్ (73) శాన్‌ఫ్రాన్సిస్కో ఆ స్పత్రిలో సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. వెంటిలేషన్ సహాయం తొలగించిన వెంటనే శాన్‌ఫ్రాన్సిస్కో కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తెల్లవారు జా ము 4గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం ఉద యం 5.30 గంటలకు )ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని జాకిర్‌హుస్సేన్ సోదరి ఖర్షిద్ అవులియా వెల్లడించారు. ఐడియోపథిక్ పల్మనరీ అనే ఊపిరితిత్తుల వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న జాకిర్ ఆరోగ్యం క్షీణించడంతో రెండు వారాల క్రితమే శాన్‌ఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో చేరారు. జాకిర్ హుస్సేన్‌కు భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తె లు అనిసా ఖురేషి, ఇసబెల్లా
ఖురేషి ఉన్నారు. “ప్రపంచ వ్యాప్తంగా అశేష సంగీత అభిమానులు ఆదరించే సంగీత వారసత్వాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్లిపోయారని, ఆయన ప్రభావం రానున్న తరతరాలకు కూడా ప్రతిధ్వనిస్తుంది” అని జాకీర్ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. నిరంతరం తబలా వాయిద్య సాధనే తపస్సుగా భావించే ప్రముఖ ఉస్తాద్ అల్లా రఖా కుమారుడైన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న జన్మించారు.
తాను పుట్టుకతోనే సాధారణ ప్రార్థనలకన్నా తబలా లయధ్వనుల మంత్రాలే తన చెవుల్లో తన తండ్రి మంత్రించారని జాకీర్‌హుస్సేన్ ఒకానొక సమయంలో గుర్తు చేసుకున్నారు. ఏడేళ్ల ప్రాయం లోనే జాకీర్ మొట్టమొదటి తబలా కచేరీ ప్రదర్శించారు. 12 ఏళ్లకే అన్ని ప్రాంతాలు పర్యటించడం ప్రారంభించారు. ఆనాటి గొప్ప సంగీత విద్వాంసులైన పండిట్ రవిశంకర్, అలీ అక్బర్‌ఖాన్, శివకుమార్ శర్మ వంటి వారితో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారు. సహకార వాద్య స్థాయి నుంచి కీలకమైన కేంద్ర వాయిద్యంగా ఖ్యాతిలోకి తీసుకొచ్చినట్టు గత ఏడాది పిటిఐ వార్తా సంస్థకు ఆయన వెల్లడించారు. వివిధ దేశాల వాయిద్యాల సమ్మేళనంతో అనేక ప్రయోగాలు చేశారు. భారతదేశ సంగీత కళాకారులే కాకుండా పాశ్చాత్య ప్రముఖ సంగీత కళాకారులతో కలిసి తన తబలా వాయిద్య కచేరీలు నిర్వహించారు. సెల్లిస్ట్ యోయో మా, జాజ్ సంగీతకళాకారుడు చార్లెస్ లాయెడ్, బంజో సంగీత వాయిద్యకారుడు బేలా ఫ్లెక్ , బాసిస్ట్ ఎడ్గార్ మేయర్, పెర్కషన్ వాయిద్య కళాకారుడు మికే హార్ట్ , బీటిల్స్ జార్జి హారిసన్ వంటివారితో కలిసి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ సంగీత అభిమానుల్లో ప్రాచుర్యం కల్పించారు.
సంగీత సాంస్కృతిక రాయబారి స్థాయికి ఎదిగారు. జాకీర్ తన కెరీర్‌లో ఐదు గ్రామీ అవార్డులు సాధించారు. 1988 లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ , 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 66 వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని అందుకున్నారు. సినిమాల్లో సంగీత దర్శకునిగా తనదైన ముద్రవేశారు. ఇన్‌కస్టడీ, ద మిస్టిక్ మసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. జాకీర్ హుస్సేన్ కుటుంబం పదేళ్ల క్రితమే భారత్ నుంచి అమెరికా వలసవెళ్లింది. తొలుత ఆదివారం రాత్రే ఆయన మృతి చెందినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార , ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటించింది. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం క్రితమే కుటుంబ సభ్యులు ఆయన మృతి చెందినట్టు ప్రకటించారు.హుస్సేన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తెలిపారు.