Saturday, January 18, 2025

వాహ్ ఉస్తాద్.. జాకీర్ హుస్సేన్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణవార్త ప్రపంచ సంగీత ప్రియులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందిన తబలాపై కమనీయ ధ్వనులు పలికించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన గొప్ప కళాకారుడు. తబలాపై తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదుమధుర రాగాలతో మురిపిస్తాయి. తబలాపై అతని చేతి మునివేళ్ళు అలల్లా ఓలలాడుతూ మధుర మృదంగాలై మోగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే తబలా విద్వాంసుడు గుర్తుకు రాకపోవచ్చు. కానీ తాజ్‌మహల్ టీ యాడ్ లో తబలా వాయించిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అతను ఎవరా అని చాలా మంది సందేహించారు.

కాసేపటి తర్వాత జాకీర్ హుస్సేన్ మరణాన్ని తెలియజేస్తూ తాజ్ మహల్ టీ యాడ్ చూపించింది అప్పటి వరకు ఆయన పేరు చాలా మందికి తెలియదు. చాలా మంది సెలబ్రిటీలు, ప్రముకులు తన పేరుతో అందరికీ పరిచయమవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తన పేరుతో కాకుండా తన ప్రతిభతో పరిచయమయ్యేవారు అతి కొద్దిమంది ఉంటారు అందులో జాకీర్ హుస్సేన్ ఒకరు. మొదటగా మన దేశంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీని 1966లో కోల్‌కతాలో నటీనటులు జీనత్ అమన్, మాళవిక తివారీ తాజ్ మహల్ టీ యాడ్‌తో ప్రారంభించారు. కానీ తయారీదారులు ఆశించినంత ప్రజాదరణ పొందలేకపోయిందని గమనించారు. ఆ తర్వాత హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ (హెచ్‌టిఎ) ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడానికి భారతీయతను పాశ్చాత్య ఎక్స్‌పోజర్‌తో సమతుల్యం చేసే బ్రాండ్ అంబాసిడర్ అవసరం వచ్చింది.

తబలా అభిమాని అయినా (హెచ్‌టిఎ) కాపీ రైటర్ కెఎస్ చక్రవర్తి జాకీర్ హుస్సేన్ పేరు ఎంపిక చేశారు. ఎంపిక సమయానికి హుస్సేన్ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండటంతో కెఎస్ చక్రవర్తి అతన్ని సంప్రదించి తాజ్ మహల్ టీ యాడ్ మీరే చేయాలనీ పట్టుపట్టడంతో అందుకు హుస్సేన్ విముఖత చూపలేక సరే అని తాజ్ మహల్ టీ దేశ నలుమూలల వ్యాప్తిచెందాలనే సంకల్పంతో యాడ్ కోసం తన సొంత ఖర్చుతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చారు. ప్రకటన స్క్రిప్ట్ కోసం గంటల తరబడి సాధన అనంతరం విజయవంతంగా పూర్తి చేశారు. దీన్ని బట్టి దేశంపై జాకీర్ హుసేన్ ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టివి వాణిజ్య ప్రకటన తర్వాత తాజ్ మహల్ టీ బ్రాండ్ హుస్సేన్ ఇంటి పేరుగా మారింది. అయితే ఈ ప్రకటనలో హుస్సేన్ కప్పు టీ తాగుతూ కనిపిస్తున్న దృశ్యాన్ని, తబలా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రసిద్ధ స్వరకర్త హరీష్ వాహ్ ఉస్తాద్, వాహ్! చెబుతుండటం దానికి బదులుగా పెర్కషన్ వాద్యకారుడు అర్రే హుజూర్, వాహ్ తాజ్ బోలియే’ ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది.

తాజ్ మహల్ టీ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అంతేకాకుండా ‘వాహ్ తాజ్’ అనే పదం చాలా సందర్భాలలో తరచుగా ఉపయోగించే బజ్‌వర్డ్‌గా మారింది. ప్రతి రోజు ఉదయాన్నే తాజ్ మహల్ టీ తాగే ప్రేమికులు మాత్రం ఆయనను ఎలా మరిచిపోగలరు. సంగీత ప్రియుడైన నేను తన మధురమైన ధ్వనులను ఎలా మరిచిపోగలను చెప్పండి. ఆయన ప్రతిభకు ఎవరైనా వాహ్ ఉస్తాద్, వాహ్ అనాల్సిందే. నాలుగు గ్రామీ అవార్డులతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, అమెరికా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్, ఫ్రాన్స్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్‌లో అధికారితో సహా లెక్కలేనన్ని అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు.

ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది. మన నిత్యజీవితంలో ఒక చిన్న అవార్డు వస్తే ఉప్పొంగిపోయే వాళ్ళని చూస్తుంటాము. కానీ కొంతమంది ఎన్ని అవార్డులు సంపాదించినా నేనే గొప్ప అనే భావన ప్రస్తావించరు. అలాంటి వారిలో జాకీర్ హుస్సేన్ ఒకరు. ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం అని చెపుతుంటారు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ఒకే ఒక మాట మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని తండ్రి చెప్పిన మాటే ఇప్పటి వరకు ఈ స్థాయిని చేర్చగలిగిందని పలు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు. అసలు సిసలు హిందుస్తానీ రాగాల ఉస్తాద్ హుస్సేన్ ఇక లేడన్న విషయం సంగీత ప్రియులందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తూనే ఉంటాయి.

కోట దామోదర్
93914 80475

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News