Monday, December 23, 2024

దెబ్బతిన్న కంటి రెటీనా బాగవుతుందా ?

- Advertisement -
- Advertisement -

క్షీరదాలకు పూర్తి భిన్నంగా జీబ్రా చేప తన కంటిలోని రెటీనా గాయపడితే తిరిగి రెటీనాను ప్రత్యుత్పత్తి చేసుకుని దృష్టిని పొందగలుగుతుంది. ఏ ప్రాణికీ లేని ఇటువంటి అద్భుత ప్రక్రియ వెనుక సంకేతాలను, జన్యువుల గుట్టును తెలుసుకోడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్‌ఇఆర్) మొహలి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ప్రక్రియ మనుషుల్లో ఎందుకు లేదన్నది వీరి సందేహం.

జీబ్రా చేపలో ప్రత్యేక మైన సంకేత వ్యవస్థ సోనిక్ హెడ్జ్‌హ్యాగ్ (ఎస్‌హెచ్‌హెచ్) కండరాలను తిరిగి ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుందని ఇదివరకే పరిశోధనలో వెల్లడైంది. రెటీనా ప్రత్యుత్పత్తిపై సోనిక్ హెడ్జ్‌హ్యాగ్ సంకేత వ్యవస్థ ప్రభావాన్ని అర్థం చేసుకోడానికి పరిశోధకులు మొదట దీని చర్యలను నిలుపు చేయించారు. ఈ సంకేతం బలహీనం కావడంతో జీబ్రా చేపలోని గర్భస్థ పిండం 90 శాతం జనన లోపాన్ని చూపించింది. ఈ లోపాన్ని శాస్త్రీయంగా సైక్లోపియాగా పేర్కొంటున్నారు. సైక్లోపియా మనుషుల్లోనూ కనిపిస్తుంది.

మధ్యలో ఒకే కన్ను తయారైనా లేదా పాక్షికంగా కన్ను విడిపోయినా సైక్లోపియా కనిపిస్తుంది. ఈ సంకేత వ్యవస్థను సవివరంగా అర్థం చేసుకుంటే అరుదైన ఈ లోపానికి కారణం తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జీబ్రా చేపలో రెటీనాపునరుద్ధరణకు సంకేత వ్యవస్థ కూడా బాధ్యతగా ఉన్నప్పటికీ మనుషుల్లో ఎందుకు ఆ విధంగా రెటీనా పునరుత్పత్తి జరగడం లేదన్నది ప్రశ్నార్థకమౌతోంది. రెటీనా గాయపడిన తరువాత మొత్తం రెటీనా ఆర్‌ఎన్‌ఎ అనుక్రమాన్ని పరిశోధకులు సమీక్షించారు.

జిక్ 2 బి, ఫ్యాక్స్‌న్ 4, ఎంఎంపి9 తదితర అనేక జన్యువులు సంకేత వ్యవస్థ ద్వారా క్రమబద్ధీకరించబడ్డాయి. జిక్ 2 బి , ఫ్యాక్సన్ 4 జన్యువులు కండరాల ప్రత్యుత్పత్తి, అభివృద్ధికి ముఖ్యమైన భాగాలు కాగా, ఎంఎంపి 9అనే ఎంజైమ్ తాజాగా కణాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మైక్రో ఆర్‌ఎన్‌ఎ (లెట్ 7) పాత్రను కూడా పరిశోధకులు గమనించగలిగారు, లిన్ 28ఎ అనే ప్రత్యేక జన్యువు ద్వారా ఇది క్రమబద్ధీకరణ అవుతుంది. ఇది రెటీనా తిరిగి ఉత్పత్తి అయ్యే ప్రక్రియలో సాధారణ సంకేత వ్యవస్థను ప్రవేశ పెడుతుంది.

గాయమైన సమయంలో కణ విభజన అవసరం. లెట్ 7కు అడ్డుకునే సామర్థం ఉంది. అందువల్ల లిన్ 28ఎ చర్యకు సిద్ధమవుతుంది. వివిధ రకాల కణాలు బహుసామర్ధ మూలకణాలుగా మార్పు చెందడానికి దోహదపడుతుంది. మూలకణాలు ప్రత్యుత్పతికి సహాయపడతాయి. పరిశోధకులు ఎలుకలపై కూడా ఇదే విధమైన ప్రయోగాలు చేశారు. ప్రొటీన్‌ను ఇంజెక్టు చేశారు. రెటీనా గాయం తరువాత ఎస్‌హెచ్‌హెచ్ ప్రొటీన్ సులువుగా సంకేత మార్గంగా మారింది. కణ విభజన పెరిగి జన్యువులు క్రమబద్ధీకరణ అయినా రెటీనా ప్రత్యుత్పత్తి మాత్రం ఎలుకల్లో కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News