Monday, January 20, 2025

సోనీ జీ విలీనం రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోనీ పిక్చర్స్ నెట్‌వర్స్ ఇండియా(ఎస్‌పిఎన్‌ఐ) జీ ఎంటర్‌ప్రైజెస్(జీల్)తో 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అదే సమయంలో జీ నిబంధనలు, షరతులను ఉల్లంఘించిందని సోనీ ఆరోపిస్తూ, వారు 90 మిలియన్ డాలర్లు (రూ. 748 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. లావాదేవీల పరిపూర్ణత కోసం తుది గడువు పొడిగింపునకు చర్చలు జరగ్గా, విలీన షరతుల పట్ల జీ సంతృప్తి చెందలేదని సోనీ తెలిపింది. ఈమేరకు సోమవారం సోనీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీకి ఈ లేఖ పంపింది. ఈ రెండు కంపెనీలు డిసెంబర్ 2021లో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విలీనం జరిగి ఉంటే జీ + సోనీ 24 శాతానికి పైగా వీక్షకులతో దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌గా అవతరించి ఉండేది. రెండు కంపెనీలు విభేదాలను పరిష్కరించుకోవడంలో విఫలమైన తర్వాత ఒప్పందం ప్రకారం, గత నెల డిసెంబర్ గడువును పొడిగించారు. ఒక నెల గడువు పొడిగింపు 2024 జనవరి 20 వరకు ఉంది, అయినప్పటికీ రెండు కంపెనీలు సమస్యలను పరిష్కరించుకోలేదు. ఇక మరోసారి గడువును పొడిగించలేదు.

సోనీపై చట్టపరమైన చర్యలు: జీ
సోనీ నుంచి లేఖ అందిన తర్వాత జీ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. బోర్డు అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను పరిశీలిస్తోంది. సోనీ వాదనలను తిరస్కరిస్తూ, సోనీపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీ వెల్లడించింది. విలీన సంస్థకు పునీత్ గోయెంకా సిఇఒగా ఉండడం సోనీకి ఇష్టం లేదు, అందుకే డీల్ రద్దు అయింది. 2021లో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు విలీనం తర్వాత ఏర్పడిన కొత్త కంపెనీకి పునీత్ గోయెంకా నేతృత్వం వహించాలని నిర్ణయించారు. పునీత్ గోయెంకా జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రదా కుమారుడు, జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అయితే తరువాత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణ కారణంగా గోయెంకాను సిఇఒ చేయడానికి సోనీ నిరాకరించింది. సోనీ తన ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ ఎన్‌పి సింగ్‌ను కొత్త కంపెనీకి సిఇఒగా చేయాలని వాదిస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జీ సోనీ నుండి రద్దు లేఖను స్వీకరించినట్లు తెలియజేసింది.

2021లో విలీనం ప్రకటన
2021లో జపాన్‌కు చెందిన సోనీ కార్ప్‌కు అనుబంధంగా ఉన్న సోనీ పిక్చర్స్ నెట్‌వరక్స్ ఇండియా (ఇప్పుడు కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్)తో విలీనాన్ని జీ ప్రకటించింది. అయితే రుణదాతలు, ఇతరుల అభ్యంతరాల కారణంగా ఈ విలీనం పూర్తి కాలేదు. ఈ విలీనంతో 10 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లు) విలువైన కంపెనీ ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News