Sunday, January 19, 2025

ఈ పోరు అందరిదీ సాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

బ్రస్సెల్స్ : రష్యాపై పోరులో తమకు మరింతగా సైనిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ యూరోపియన్ యూనియన్ (ఇయూ)ను అభ్యర్థించారు. పోరుకు ఏడాది కావస్తున్న దశలో జెలెన్‌స్కీ గురువారం ఇయూ పార్లమెంట్‌ను ఉద్ధేశించి ప్రసంగించారు. రష్యా పై పోరు కేవలం తమ దేశానిదే కాదని, ఇతరత్రా యూరప్ దేశాలు కూడా ఈ ఘర్షణలో పాలుపంచుకోవల్సి ఉంటుందని, కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. రష్యా ప్రపంచంలోనే అతి తీవ్రమైన యూరప్ వ్యతిరేక శక్తి అని తెలిపారు. ప్రసంగం తరువాత జెలెన్‌స్కీ ఇయూ జెండాను పట్టుకుని నిలబడ్డారు. ఈ దశలో మొత్తం పార్లమెంట్ మౌనంగా ఉండి, ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించింది. ఈ దశలోనే ఉక్రెయిన్ జాతీయ గీతం ఆలాపన జరిగింది. ఇయూ ఎంపిలను ఉద్ధేశించి జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి ముందు మధ్యమధ్యలో తరువాత కూడా పలుసార్లు సభికుల నుంచి హర్షధ్వానాలు వెలువడ్డాయి.

తాము ఒక్కరిమే రష్యాతో పోరు చేయడం కత్తిమీద సాము అవుతుందని, ఇతర దేశాల నుంచి కూడా తగు సాయం అవసరం ఉంటుందని జెలెన్‌స్కీ తెలిపారు. ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి తమకు సైనిక ఆయుధ సాయం అత్యవసరం అని, ఇది సకాలంలో తక్షణం స్పందించి చేయాల్సిన సాయం అని జెలెన్‌స్కీ తెలిపారు. జెలెన్‌స్కీ మాట్లాడటానికి ముందు ఇయూ పార్లమెంట్ అధ్యక్షులు రాబెర్టా మెట్సోలా ప్రసంగించారు. మిత్రపక్షాలు తక్షణం ఉక్రెయిన్‌కు సాయం అందించే విషయంలో స్పందించాల్సి ఉందన్నారు, ప్రత్యేకించి లాంగ్ రేంజ్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్‌కు సాయంగా పంపించాల్సి ఉందన్నారు. రష్యాకు తగు విధంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. రష్యా అధ్యక్షులు పుతిన్ తరచూ వెలువరిస్తున్న యుద్ధ ప్రకటనలకు దీటుగా స్పందన ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని, దీనికి అనుగుణంగానే అందరి స్పందన ఉండాలని సూచించారు. ఆ తరువాత జెలెన్‌స్కీ ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News