ఐరాసకు తెలిపిన జెలెన్‌స్కీ
న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై యుద్ధం నిలిపివేసే ఆలోచన రష్యాకు ఏ కోశానా లేదని మరోసారి స్పష్టం అయిందని ఉక్రెయిన్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభను ఉద్ధేశించి ఉక్రెయిన్ అధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్‌స్కీ గురువారం మాట్లాడారు. రష్యా అధ్యక్షులు తాజాగా చేసిన టీవీ ప్రసంగం ప్రపంచానికి ఆ దేశ అసలు స్వరూపాన్ని మరింతగా వెలుగులోకి తీసుకువచ్చిందని తెలిపారు. యుద్ధం నిలిపివేయడం అనే యోచన అసలుకే లేదు. పైగా తీవ్రస్థాయి దాడులకు రష్యా అధినేత ఆలోచిస్తున్నారని జెలెన్‌స్కీ విమర్శించారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు, రష్యా సేనలను తరిమివేసేందుకు తమ దేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ విధమైన స్థితికి తమను నెట్టినది ఎవరనేది ప్రపంచ దేశాలు గుర్తించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఓ వైపు రష్యా యుద్ధం కోసం అదనంగా 3 లక్షల మంది సైనికులను సమీకరించుకునేందుకు సిద్ధం అవుతోందనే విషయం పుతిన్ అధికారిక ప్రసంగం దశలోనే స్పష్టం అయిందన్నారు.