కీవ్: యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఆంక్షల ఒత్తిడి తీసుకురావాలని గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలను కోరుతోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా రష్యా ప్రజలను ఉద్దేశిస్తూ కీలక అభ్యర్థన చేశారు. రష్యన్ సైనికుల తల్లులు తమ కొడుకులను యుద్ధానికి పంపించకుండా అడ్డు కోవాలంటూ విన్నవించారు. “రష్యన్ తల్లులకు మరోసారి విన్నవిస్తున్నా.. మీ కుమారులను విదేశీ గడ్డపై యుద్ధానికి పంపకండి. మీ కొడుకు ఎక్కడున్నాడో చెక్ చేసుకోండి. మీ ప్రభుత్వం వారిని విన్యాసాలు చేయడానికో.. మరో ప్రాంతానికో పంపించామంటే నమ్మకండి. మీ కుమారుడిని ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి పంపించినట్టు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అడ్డుకోండి” అని జెలెన్‌స్కీ ఓ వీడియోలో పొరగుదేశం మహిళలను అభ్యర్థించారు. ఇలాంటి భయానక యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎన్నడూ కోరుకోలేదని జెలెన్‌స్కీ ఈ సందర్భంగా చెప్పారు. అయితే తమ దేశాన్ని కాపాడుకొనేందుకు ఎంతవరకైనా పోరాడుతామన్నారు. రస్యా దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. 12 వేల మందికి పైగా రష్యన్‌సైనికులను హతమార్చడంతోపాటు అనేక మందిని నిర్బంధించినట్టు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే తమవైపు 498 మంది జవాన్లు మాత్రమే మరణించినట్టు రష్యా మొదటినుంచి చెప్పుకువస్తోంది.
Zelensky Appeal to mothers of Russian Soldiers