వాషింగ్టన్ : రష్యా దాడి గురించి తాము ముందే హెచ్చరించినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీనే వినలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా వెల్లడించారు. లాస్‌ఏజెంల్స్‌లో నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల నాటి పరిణామాలను వివరించారు. “రష్యా దాడి గురించి నేను ముందస్తుగా చేసిన హెచ్చరికలను అతిశయోక్తిగా చేసిన ప్రకటన అని చాలామంది భావించారు. అది నాకు తెలుసు. కానీ మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడించాం. ఆయన (పుతిన్‌ను ఉద్దేశించి) సరిహద్దు లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే జెలెన్‌స్కీ ఈ విషయాన్ని వినేందుకు ఇష్టపడలేదు. ఇంకా చాలామంది వినలేదు. వారు ఎందుకు వినకూడదనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు ” అంటూ బైడెన్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించకముందే రష్యా సైనిక సన్నద్ధతపై అమెరికా హెచ్చరికలు చేసింది. తేదీతోసహా యుద్ధం ప్రారంభమయ్యే రోజును పేర్కొంది. కాకపోతే తేదీలో మార్పు జరిగినా అంచనా వేసినట్టుగానే పుతిన్ సేనలు దురాక్రమణకు దిగాయి. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్ర దేశాలు కూడా కొన్ని నమ్మలేదు. అమెరికా మరీ ఎక్కువ ముందు జాగ్రత్త పడుతోందని అంతా భావించారు.