కీవ్ : అమెరికా లోని శ్వేతభవనంలో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయినప్పుడు తన పోరాట స్వరంతో ప్రకంపనలు సృష్టించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎట్టకేలకు శనివారం ఖనిజ ఒప్పందానికి సిద్ధమయ్యారు. శుక్రవారం భేటీలో ఖనిజ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య సంతకాలు జరుగుతాయని అనుకున్నా , భేటీ వాడిగా, వేడిగా సాగడంతో అర్ధంతరంగా భేటీ నుంచి జెలెన్‌స్కీ నిష్క్రమించారు. అయితే ఖనిజ పంపద ఒప్పందానికి సిద్ధమేనని జెలెన్‌స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చేందుకు తొలి అడుగు అవుతుందని ప్రకటించారు.
ఈ ఒప్పందం ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ‘అయితే ఇది ఒక్కటే సరిపోదు. భద్రతా హామీలు లేకుండా రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్‌కు చాలా ప్రమాదకరం. గత మూడేళ్లుగా మేము పోరాడుతున్నాం. అమెరికా తమ వైపే ఉందని ఉక్రెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” తన ఎక్స్ ద్వారా తెలియజేశారు. ‘ఉక్రెయిన్ ఆవేదనను అందరూ వినాలి. ఎవరూ విస్మరించరాదు. యుద్ధం లోనే కాదు, ఆ తరువాత కూడా ’అని వివరించారు. రష్యాతో తాము సాగిస్తున్న యుద్ధానికి అమెరికా అందిస్తున్న సాయానికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే అమెరికా కాంగ్రెస్, అమెరికా ప్రజలు ద్వైపాక్షిక మద్దతు అందించారని ప్రశంసించారు. అమెరికా అందిస్తున్న సాయానికి , ప్రత్యేకించి గత మూడేళ్లుగా పూర్తికాల దాడులతో రష్యా సాగిస్తున్న యుద్ధంలో అన్ని విధాలా అందుతున్న సాయానికి ఉక్రెయిన్ ప్రజలు నిత్యం అమెరికాను అభినందిస్తుంటారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదమే యుద్ధ గమనానికి నిర్ణయాత్మకమవుతుందని వివరించారు. ‘ట్రంప్ సాయం తమకు ఎంతో కీలకం. ఆయన యుద్ధం పరిసమాప్తం కావాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ తమకు మించి మరెవరూ శాంతిని కోరుకోవడం ఇది స్వేఛ్చాస్వాంతత్య్రాల కోసం సాగుతున్న సమరం. మా మనుగడ కోసం సాగిస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో నిన్నటి శ్వేతభవనం సమావేశం ఫోటో జత చేసి పెట్టారు.