Sunday, December 22, 2024

బఖ్ముత్ నేలమట్టం.. మా చేజారలేదు

- Advertisement -
- Advertisement -

అప్పటి హిరోషిమాతో పోల్చిన జెలెన్‌స్కీ

హిరోషిమా : అణుబాంబు తాకిడికి గురైన అప్పటి హిరోషిమా ఇప్పటి రష్యా దాడికి దెబ్బతిన్న బఖ్ముత్‌లాగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ తెలిపారు. జపాన్‌లోని హిరోషిమాలో జి 7 సదస్సుకు ఆయన ఆహ్వానితుడిగా వచ్చారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిని ప్రపంచ వేదిక ద్వారా తెలియచేసేందుకు యత్నించారు. హిరోషిమాలో అప్పటి అణుబాంబు విధ్వంసాన్ని తెలిపే ఛాయాచిత్రాల ప్రదర్శనను చూసిన తనకు తమ భూభాగంలోని బఖ్ముత్ పరిస్థితి గుర్తుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1945లో అమెరికా ఆధ్వర్యపు సేనల అణుబాంబుల తాకిడికి హిరోషిమా దెబ్బతింది.

ఏళ్ల తరబడి గడ్డిమొలవని స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జి 7కు వేదిక అయింది. ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ రష్యా దాడికి ముందు 70వేల జనాభాతో ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ ఎంత మంది బతికి ఉన్నారో ఎందరు చనిపొయ్యారో తెలియదు. ఈ భూభాగం పూర్తిగా విధ్వంసం అయింది. మనిషి ఆనవాళ్లు లేవు. రష్యన్లు కూడా భారీ సంఖ్యలో చనిపొయ్యారని జెలెన్‌స్కీ తెలిపారు. దెబ్బతిన్న ఈ ప్రాంతం ప్రజలను తాము వారి చావుకు వారిని వదిలివేయం లేదన్నారు. ప్రజలే తమకు మూలధనం, అక్కడేం జరుగుతున్నదనేది తనకు తెలుసునని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ వివరాలను వెల్లడించలేనన్నారు.

అయితే ఇది రష్యా సేనల హస్తగతం కాలేదని స్పష్టం చేశారు. బఖ్ముత్ ఇప్పటికీ ఉక్రెయిన్ గుండెచప్పుడుగానే ఉందని, నేలమట్టం అయిన ఈ ప్రాంతం రష్యా దాడులకు ప్రతీకగా విధ్వంసక స్థలిగా నిలిచిందన్నారు. రష్యా ఆధీనంలోకి వెళ్లిందని అంతా భావిస్తున్నారని, అయితే ఇది నిజం కాదని, కానీ ఈ ప్రాంతం రక్తసిక్తం అయిందనేది నిజం అన్నారు. హిరోషిమా పునర్నిర్మాణ స్ఫూర్తితో తాము ఉక్రెయిన్‌లో ఇప్పటి దురాక్రమణలో దెబ్బతిన్న పలు ప్రాంతాలను తిరిగి నిలబెట్టి, మునుపటి స్వరూపానికి తీసుకురావాలనే తపన పెరిగిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఒక్కరోజు క్రితమే ఈ ప్రాంతాన్ని తాము పూర్తిగా కైవసం చేసుకున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. దీనిని ప్రస్తావించకుండా జెలెన్‌స్కీ బఖ్ముత్ చేజారలేదని, అయితే కోలుకోలేని రీతిలో గాయపడిందని, కానీ ప్రజలను ఆదుకుంటూ తిరిగి తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News