స్పందిస్తేనే స్వేచ్ఛ: జెలెన్‌స్కీ
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను కేవలం ఈ ఒక్క దేశానికే పరిమితంగా భావించరాదని దేశాధ్యక్షులు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా దురాగతాలపై ప్రపంచ దేశాలు అన్ని స్పందించాల్సి ఉందన్నారు. రష్యా ఆక్రమణలను ఎదుర్కొవడానికి ప్రజాస్వామ్య దేశాలు అన్ని సంఘటితంగా ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షులు రోజువారి వీడియో సందేశంలో రష్యా లక్షం యావత్తూ యూరప్ అని, ఉక్రెయిన్ కేవలం ఆరంభం అని విశ్లేషించారు. పలు రకాలుగా యూరప్‌ను దెబ్బతీసి, తమ ఆధిపత్యం చాటుకునేందుకు రష్యా అధినేత కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. బ్రిటన్, ఆస్ట్రియా దేశాల నేతలు తమ దేశంలో పర్యటించారని , యూరప్ దేశాల సంఘీభావానికి ఇది ప్రతీక అని, తాను యూరప్ దేశాధినేతలకు ఈ అంశంపై కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని జెలెన్‌స్కీ చెప్పారు.
బ్రిటన్ ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందుతోందని , ఈ దిశలో స్పందించిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, కెనడా ప్రధానికి ధన్యవాదాలు చెపుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలకు సాయంగా ఇప్పటికే 10 బిలియన్ యూరోలు ( 11 బిలియన్ల డాలర్ల) విరాళాలు అందాయని జెలెన్‌స్కీ గుర్తు చేశారు. రష్యా చమురు ఇతర సరుకులపై ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు విధించాలని, ఇంధనం వనరులను చూసుకుని రష్యా మొండిగా తాను ఏమీ చేసినా అడిగే వారే లేరనే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. స్వేచ్ఛ కోసం నిరీక్షిస్తూ కూర్చోవడం కుదరదని, ఎప్పుడైతే ఆక్రమణలపై కిమ్మనకుండా ఉండటం అలవర్చుకుంటామో అప్పుడే స్వేచ్ఛకు దూరం అవుతామని, దీనిని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలని కోరారు.