ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన
కీవ్: రష్యన్ సేనల దాడులతో తమ దేశంలోని పవిత్ర ప్రార్థనా స్థలాలకు ముప్పు వాటిల్లుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దళాలు తమ చరిత్రను చెరిపివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ప్రసంగంలో కీవ్‌లోని అమరవీరుల స్మారక స్థలి బాబీ యార్‌పై రష్యా దళాలు బాంబులు వేయడాన్ని ఖండించారు. ఇది మానవత్వానికే కళంకమని, దీన్ని బట్టి చాలామంది రష్యన్లకు కీవ్‌ను ఒక పరాయి దేశంగానే చూస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు. తమ రాజధాని గురించి, తమ చరిత్ర గురించి వారికేమీ తెలియదని ఆయన పేర్కొన్నారు. తమ చరిత్రను, తమ దేశాన్ని, తమ ప్రజలందరినీ తుడిచివేయమని వారికి(రష్యా దళాలు) ఆదేశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబీ యార్ తర్వాత దేనిపై దాడి చేస్తారు..సెయింట్ సోఫియా క్యాధెడ్రల్, లావ్రా, ఆండ్య్రూ చర్చినా అని ఆయన ప్రశ్నించారు. గత గురువారం నుంచి రష్యా దురాక్రమణ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 6 వేల మంది రష్యన్ సైనికులు మరణించారని కూడా జెలెన్‌స్కీ వెల్లడించారు. అయితే రష్యా ఇప్పటివరకు తమ సైనికులు ఎందరు ఉక్రెయిన్‌లో మరణించారో ప్రకటించలేదు.