Saturday, November 23, 2024

కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు

- Advertisement -
- Advertisement -

కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్రానికి నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం

తిరునంతపురం: కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం డుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 14కు చేరడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు 24 ఏళ్ల మహిళలో గురువారం వెలుగు చూసినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంనుంచి మొత్తం 19 శాంపిల్స్‌ను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్‌ఐవి)కి పంపించగా మరో 13మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కేరళలో జికా వైరస్ కేసులతో పక్క రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. డెంగీ తరహా లక్షణాలే ఉండే ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. కాగా జికా వైరస్ పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపించినట్లు కేంద ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. ఈ బృందంలో దోమనుంచి వ్యాపించే వ్యాధులకు సంబంధించిన నిపుణులు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
జికా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
జికా వ్యాధి జికా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.ఈ వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాఅడవుల్లోని రీసన్ కోతిలో గుర్తించారు.1954లో నైజీరియాలో ఈ వ్యాధి బైటపడింది. పలు ఆఫ్రికన్ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా,ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాంలాటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. 2016ఫిబ్రవరి నాటికి 39 దేశాల్లో జికా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)దీన్ని ప్రజాఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వైరస్ కలిగిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, కండ్ల కలక, జీర్ణ కోశ సంబంధిత సమస్యలు, గొంతునొప్పి, దగ్గు, లింఫ్ గ్రంథులు ఉబ్బడం వంటి లక్షణాలు కనబడతాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో రక్త నమూనాలను ఆర్‌టిపిసిఆర్ ద్వారా నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. రోగి లక్షణాలను బట్టి వైద్యం అందిస్తారు. రోగులకు విశ్రాంతి అవసరం. వారు ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ లాంటి మందులు వాడాలి. ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత మళ్లీ రాదు. దోమలుకుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Zika virus cases raised to 14 in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News