Wednesday, December 25, 2024

రాష్ట్రంలో జికా వైరస్ కలకలం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జికా వైరస్ కలకలం
తెలంగాణ సహా 13 రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి
ఐసిఎంఆర్,ఎన్‌ఐవీ అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవి) నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా 13 రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 67 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. అందులో 86.56 శాతం రోగులలో స్వల్ప లక్షణాలు ఉండగా, తక్కువ మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం.
ఎలా వ్యాపిస్తుంది?
డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి.
లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు. ఈ వైరస్ సోకిన వారందరిలో లక్షణాలు ఉండవు. ప్రతి 10 మందిలో ఇద్దరికి మాత్రమే లక్షణాలు ఉంటాయి. వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి.
వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
మెదడు, నాడీ మండలంపై ఎఫెక్ట్
జికా వైరస్ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం) తలెత్తే ప్రమాదం ఉంటుంది.
గర్భస్థ శిశువులకు ప్రమాదం
గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భంలోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.

Zika Virus Spread 13 States including Telangana:ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News